
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఇటీవలి పరిణామాలు అంతర్జాతీయ చట్టాల నిలకడపై కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిమ్‌స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ–సెక్టోరల్ టెక్నికల్, ఎకనామిక్ కో–ఆపరేషన్) దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ భద్రత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
బుధవారం ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన బిమ్‌స్టెక్ ఐదో శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఆరోగ్యం, ఆర్థిక భద్రత విషయంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యమత్యం, పరస్పర సహకారం తక్షణమే అవసరమని పేర్కొన్నారు. అనుసంధానం, సౌభాగ్యం, భద్రతకు బంగాళాఖాతాన్ని ఒక వారధిగా మార్చాలన్నారు. బిమ్‌స్టెక్ సెక్రెటేరియట్ ఆపరేషన్ బడ్జెట్‌కు మిలియన్ డాలర్లు అందజేస్తామని ప్రకటించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల మన ప్రజలు, ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ ప్రభావితం అవుతూనే ఉన్నాయని గుర్తుచేశారు.
విజన్ డాక్యుమెంట్ రూపొందిద్దాం..
ఈ సదస్సులో బిమ్‌స్టెక్ చార్టర్‌ను తీసుకురావడం కీలకమైన ముందుడుగు అని మోదీ అభివర్ణించారు. ఈ చార్టర్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించడానికి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలన్న సెక్రెటరీ జనరల్ ప్రతిపాదనకు ప్రధాని అంగీకారం తెలిపారు. మన ఆకాంక్షలు నెరవేరే దిశగా బిమ్‌స్టెక్ సెక్రటేరియట్‌ను శక్తివంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. అందుకోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని సెక్రెటరీ జనరల్‌కు సూచించారు. బిమ్‌స్టెక్ దేశాల వ్యాపారవేత్తలు, స్టార్టప్‌ల మధ్య అనుసంధానం పెరగాలని, వ్యాపార వాణిజ్యాల్లో అంతర్జాతీయ నిబంధలను పాటించాలని తెలిపారు. ప్రాంతీయంగా భద్రత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని మోదీ కుండబద్ధలు కొట్టారు.
ఉగ్రవాదంపై పోరాటం కోసం గత ఏడాది తీసుకున్న నిర్ణయం చురుగ్గా అమలవుతోందని హర్షం వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలో కోస్టల్ షిప్పింగ్ ఎకోసిస్టమ్ కోసం సాధ్యమైనంత త్వరగా లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బిమ్‌స్టెక్ దేశాల నడుమ రోడ్డు మార్గంద్వారా అనుసంధానం పెరగాలని చెప్పారు. బిమ్‌స్టెక్ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సహకార అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. బిమ్‌స్టెక్‌లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment