సాక్షి, ముంబై: రాయ్‌గఢ్ జిల్లాలోని హరిహరేశ్వర్ బీచ్‌కు కొట్టుకొచ్చిన అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. బోటు వ్యవహారంలో ఉగ్రవాద కోణం లేదని చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే పడవలో మందుగుండు సామాగ్రీ ఎందుకు ఉన్నాయో ఇప్పుడే చెప్పలేమన్న డిప్యూటీ సీఎం.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగుతోందన్నారు.
ప్రాథమిక సమాచారం మేరకు.. కొట్టుకొచ్చిన బోటు ఆస్రేలియాకు చెందిన హాన్ అనే మహిళదని తెలిపారు. తన భర్త జేమ్స్ హర్బర్ట్‌తో కలిసి మస్కట్ మీదుగా యూరప్ వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. జూన్ 26న ఇంజిన్ ఫెయిల్ అవ్వడం వల్ల బోటు ప్రమాదానికి లోనైందన్నారు. బోట్‌లో ఉన్న వారిని కొరియా షిప్ రక్షించిందని పేర్కొన్నారు.
చదవండి: రాయ్‌గఢ్‌లో బోటు కలకలం.. మూడు ఏకే 47.. ఇంకా
అయితే ధ్వంసమైన పడవ మాత్రం సముద్ర జలాల్లో కలిసిపోయి అలలకు రాయ్‌గఢ్ తీరానికి కొట్టుకు వచ్చిందన్నారు. అయినప్పటికీ ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం స్థానిక పోలీసులు, యాంటీ టెర్రర్ స్క్వాడ్‌లు కేసు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలు జరుపుకునే దహీ హండీ, వినాయకచవితి పండుగలకు పటిష్ట భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
కాగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా హరిహరేశ్వర తీరం వద్దకు గురువారం ఓ అనుమానాస్పద బోటు కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. బోటులో మూడు ఏకే 47 రైఫిళ్లు, తూటాలు, మరికొన్ని ఆయుధాలు ఉన్నాయి. దీంతో ఉగ్రవాదుల కట్రమోనని భావించిన అధికారులు, పోలీసులు రాయ్‌గఢ్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment