ముంబయి: బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ డియో అర్దాంతరంగా రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు కోర్టు హాల్‌లోనే ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నాగ్‌పూర్‌లోని కోర్టు హాల్‌లో ఈ మేరకు ప్రకటించారు. ఆత్మగౌరవంలో రాజీపడలేనని ఆయన చెప్పినట్లు హాల్‌లో ఉన్న ఓ లాయర్ ఈ విషయాన్ని తెలిపారు.
'కోర్టులో ఉన్నవారందరికీ క్షమించమని కోరుతున్నా. మెరుగుపడాలనే మిమ్మల్ని అప్పడప్పుడు తిట్టాను. నేను కూడా మెరుగుపడాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు ఉండదు. ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యులే. చెప్పడానికి చింతిస్తున్నా.. నా రాజీనామాను ఇచ్చేశాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేను. మీరంతా కష్టజీవులు' అని జడ్జి చెప్పినట్లు ప్రత్యక్షంగా ఉన్న ఓ లాయర్ చెప్పారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే క్రమంలో మాత్రం తన వ్యక్తిగత కారణాలతోనే దేశ అధ్యక్షురాలికి రాజీనామా ఇచ్చినట్లు జస్టిస్ రోహిత్ డియో చెప్పారు.
కీలక తీర్పులు..
అయితే.. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సాయిబాబాను 2022లో జస్టిస్ రోహిత్ డియో నిర్దోషిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జీవత ఖైదు శిక్షను పక్కకు పెట్టారు. ఉపా చట్టం కింద చెల్లుబాటు అయ్యే అవకాశం లేనప్పుడు విచారణ అనేదే శూన్యం అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు నిలుపదల ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కేసును మళ్లీ నూతనంగా విచారణ చేపట్టాలని నాగపూర్‌కు చెందిన హైకోర్టు బెంచ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జస్టిస్ రోహిత్ డియో నాగపూర్‌కు చెందిన హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సభ్యునిగా ఉన్నారు.
ఇదే కాకుండా నాగపూర్-ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేలో మైనర్ ఖనిజాల తవ్వకాల అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా జస్టిస్ రోహిత్ డియో స్టే విధించారు. 2017లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ రోహిత్ డియో 2025 డిసెంబర్ వరకు కొనసాగనుండగా.. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు 2016లో మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్‌గా కూడా జస్టిస్ రోహిత్ డియో పనిచేశారు.
ఇదీ చదవండి: జ్ఞానవాపి ముస్లిం కమిటీకి సుప్రీంలో చుక్కెదురు.. ASI సర్వేకు గ్రీన్ సిగ్నల్.. ఇటు పురావస్తు శాఖకు ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment