ఢిల్లీ: న్యాయమూర్తుల ప్రొటోకాల్ అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేం విశేషాధికారం కాదని.. ఆ సౌకర్యాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడమూ సరికాదని, తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో గౌరవమూ తగ్గిపోతుందన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు తన అభిప్రాయంతో కూడిన లేఖలు రాశాయన.
తీర్పులతోనే కాదు.. ప్రొఫెషనల్ ఆటిట్యూడ్‌తోనూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తరచూ వార్తల్లో నిలుస్తుండడం చూస్తున్నాం. సుప్రీం కోర్టు కఫేటేరియాను సందర్శించడం, న్యాయస్థానం కార్యాలయాల పని తీరుతో పాటు అక్కడ పని చేసే వాళ్ల పోస్టుల పేర్లను మార్చాలని(పారిశుద్ధ్య కార్మికులతో సహా) ప్రతిపాదించడం లాంటి చర్యలతో ప్రశంసలు అందుకున్నారాయన. ఈ క్రమంలో..
తాజాగా ఓ హైకోర్టు న్యాయమూర్తి తనకు రైలు ప్రయాణంలో ఎదురైన ఇబ్బందికర అనుభవం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సదరు రీజినల్ రైల్వే మేనేజర్ నుంచి కోర్టు రిజిస్ట్రార్ ద్వారా వివరణ కోరడం తెలిసే ఉంటుంది. ఈ పరిణామంపై స్పందించే క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్.. పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాశారు.
రైల్వే సిబ్బందిపై హైకోర్టుకు “క్రమశిక్షణా పరిధి’’ ఉండదని అని సీజేఐ డీవై చంద్రచూడ్ లేఖల్లో న్యాయమూర్తులకు గుర్తు చేశారు. అలాగే.. ప్రొటోకాల్ అనేది విశేషాధికారం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారాయన. ఈ క్రమంలో న్యాయవ్యవస్థలో స్వీయ ప్రతిబింబం, కౌన్సెలింగ్ అవసరమంటూ అభిప్రాయపడ్డారాయన.
‘‘న్యాయమూర్తులు తమకు అందుబాటులో ఉన్న ప్రొటోకాల్ సౌకర్యాలు ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. కానీ, ఆ సమాజం నుంచి వాళ్లను వేరే చేసే విధంగా.. లేదంటే తమను తాము ప్రత్యేక వ్యక్తిగా చూపించుకునే ప్రయత్నం చేయకూడదు. కోర్టుల్లోనే కాదు.. బయటా న్యాయపరమైన అధికారాన్ని తెలివిగా అమలు చేయాలి. తద్వారా న్యాయవ్యవస్థపై విశ్వసనీయత, చట్టబద్ధతను.. అలాగే న్యాయమూర్తుల సమాజ గౌరవం నిలబడుతుంది.
అంతేగానీ.. ఆ సౌకర్యాలతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అలాగే.. న్యాయవ్యవస్థపై బహిరంగ విమర్శలు చేసేందుకు దారి తీయకూడదు. నా ఈ అభిప్రాయాలను తెలియజేస్తున్నానని.. ఇక మీ అభిప్రాయాలను తనతో పంచుకోవాల’’ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరారాయన.
అలహాబాద్ హైకోర్టు జడ్జి గౌతమ్ చౌదరి తాజాగా రైలు ప్రయాణంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. తన భార్యతో కలిసి పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న సమయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైందట. రైలు ఆలస్యంతో పాటు సమయానికి భోజనం దొరక్కపోవడం లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారట. ఆ సమయంలో ఆయన రైల్వే పోలీసులు, రైల్వే సిబ్బంది నుంచి బదులు కోసం చూడగా.. ఫలితం లేకుండా పోయిందట.
దీంతో న్యాయమూర్తి అనే తన గౌరవానికి భంగం వాటిల్లిందటూ ఆయన ప్రయాగ్‌రాజ్‌లోని నార్త్ సెంట్రల రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌ను వివరణ కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా లేఖ పంపించారు.
ఇదీ చదవండి: ఇదేంది ఇది.. 100 పేజీల తీర్పు కాపీనా?
Comments
Please login to add a commentAdd a comment