ప్రధాని మోదీతో సమావేశమైన బొమ్మై
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బిట్‌కాయిన్ ఆరోపణల గురించి ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించగా దీని గురించి పట్టించుకోరాదని, ప్రజల కోసం సమర్థంగా పనిచేయాలని సలహా ఇచ్చారని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రధానితో సుమారు అర్దగంటకు పైగా సమావేశమై పలు అంశాలను చర్చించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. బిట్‌కాయిన్ కేసు గురించి ప్రధాని వద్ద ప్రస్తావించగా, దీని గురించి పట్టించుకోవలసిన అవసరం లేదని సలహా ఇచ్చారన్నారు.
డిసెంబరులో నాలుగు కార్యక్రమాల ప్రారంభానికి రాష్ట్రానికి ప్రధానిని ఆహ్వానించానని, సమయం చూసుకుని తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. సీఎంగా వందరోజుల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి తెలియజేశానని, సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
జేపీ నడ్డాతో చర్చలు..
పార్టీ అధినేత జేపీ నడ్డాను ఆయన నివాసంలో సీఎం బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషితో వెళ్లి అర్ధగంట పాటు చర్చించారు. మీడియా దృష్టికి రాకుండా ఈ సమావేశం జరగడంతో కుతూహలం నెలకొంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, త్వరలో జరిగే 25 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు, బీబీఎంపీ, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు చర్చకు వచ్చాయి. సీఎం బెంగళూరుకు తిరిగివచ్చాక రాజకీయంగా పలు మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని సమాచారం. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు మారే చాన్సుందని పార్టీ వర్గాల కథనం.
నా కొడుకు ఉన్నా వదలద్దు: కోళివాడ..
బిట్‌కాయిన్ స్కాంలో ఎంత పెద్దవారున్నా వదలవద్దని, కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ కేబీ కోళివాడ డిమాండ్ చేశారు. ఆయన గురువారం రాణి బెన్నూరులో విలేకర్లుతో మాట్లాడుతూ బిట్‌కాయిన్ అనేది పెద్ద నేరం. ఈ నేరంలో నా కొడుకు, సీఎం కొడుకులు ఉన్నా విడిచిపెట్టవద్దు, కఠినంగా శిక్షించాలి. నిందితులు ఏ పార్టీ వారు అన్నది చూడవద్దు అని చెప్పారు. ఈ దందాలో కోళివాడ కుమారుని పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో స్పందించారు.
మాపై బురదచల్లే పని: డీకే..
శివాజీనగర: బిట్‌కాయిన్ స్కామ్‌లో కాంగ్రెస్‌పై బురద చల్లుతున్నారు. మా వద్దా ఆధారాలున్నాయి. తగిన సమయంలో బహిరంగ పరుస్తామని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ తెలిపారు. విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్కామ్‌లో కాంగ్రెస్‌వారి పిల్లలు ఉంటే అరెస్టు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment