లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ తాజాగా అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఈ రెండో జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీల ఊసే ఎత్తలేదు.
దీంతో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనేది సస్పెన్స్‌గానే మిగిలింది. మరోవైపు రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాంటూ యూపీ కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. ఇంత జరుగుతున్నా పార్టీ హైకమాండ్ ఈ రెండు సీట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీ ఆసక్తి చూపడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు ఆమె బరేలీకి రాలేదు. అయితే ఆ సమయంలో ఆమె ఆరోగ్యం బాగాలేదని, అందుకే యాత్రలో పాల్గొనలేకపోయారని పార్టీ నేతలు తెలిపారు. ప్రియాంక ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని కూడా వారు అంటున్నారు.
మరోవైపు 2019 ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ ఈసారి రాయ్‌బరేలీపై కన్నేసింది. రాయ్‌బరేలీ రాజకీయాలలో కీలకంగా ఉంటున్న ప్రముఖ నేతలు దినేష్ సింగ్, అఖిలేష్ సింగ్, మనోజ్ పాండేలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఇది కాంగ్రెస్‌కు గట్టిపోటీ నిచ్చేలా ఉంది.
రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారా? లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయవచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ విషయంలో రాహుల్ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment