Corona Second Wave in India: భారత్‌కు ‘సెకండ్‌వేవ్‌’ భయం! | Corona News in Telugu - Sakshi
Sakshi News home page

కరోనా: భారత్‌కు ‘సెకండ్‌వేవ్‌’ భయం!

Published Tue, Oct 27 2020 8:06 AM | Last Updated on Tue, Oct 27 2020 12:46 PM

Covid 19: As Winter Chill Hints At Second Wave - Sakshi

సాక్షి. హైదరాబాద్‌: కరోనా మరోసారి కోరలు చాస్తుందా? ఉధృతి తగ్గినట్లు కనిపిస్తున్న ఈ మహమ్మారి మరోసారి విజృంభిస్తుందా?... ఆ ప్రమాదం పొంచివుందని, ‘సెకండ్‌వేవ్‌’మొదలయ్యే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల మూడు, నాలుగు వారాల్లో లేదా డిసెంబర్‌ మొదటి వారంలో కోవిడ్‌ ఉధృతి మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ మహమ్మారి అయినా సెకెండ్‌వేవ్‌లో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, అమెరికా, తదితర పశ్చిమదేశాల్లో కోవిడ్‌ సెకెండ్‌వేవ్‌ కేసులు, ప్రభావం క్రమంగా పెరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మనదేశంలో తొలిదశ కరోనా వ్యాప్తి (ఫస్ట్‌వేవ్‌) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడం మొదలైందని, త్వరలోనే సెకెండ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది.

పండుగల సీజన్‌లో వైరస్‌ వ్యాప్తిచెందకుండా ప్రజలు ఏమేరకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారనే దానిపై సెకెండ్‌వేవ్‌ తీవ్రత ఆధారపడి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నా, మరికొన్ని రాష్ట్రాల్లో 2 వారాలుగా అధిక కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారులు పూర్తిగా అంతమొంది, కనుమరుగైపోవడానికి ముందు ‘మల్టీపుల్‌ వేవ్స్‌’గా వస్తాయని, ఇది ప్రపంచవ్యాప్తం గానూ లేదా కొన్నిదేశాల్లో స్థానికంగానూ జరిగే అవకాశాలున్నాయని యశోద చీఫ్‌ ఇంటర్వెన్షెనల్‌ పల్మనాలజిస్ట్‌ డా. హరికిషన్‌ గోనుగుంట్ల తెలిపారు. మళ్లీ ఆసుపత్రుల్లో కోవిడ్‌ అడ్మిషన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయని, గతంలోనూ ఇదేవిధంగా నెమ్మదిగా అడ్మిషన్లు మొదలై ఆ తర్వాత కేసుల తీవ్రత, వైరస్‌ వ్యాప్తి పెరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. సెకెండ్‌వేవ్‌తో ముడిపడిన వివిధ అంశాలపై ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..      (ఏడాదికి 50 కోట్ల డోసులు)

వచ్చేది చలికాలం...
మనదేశం కరోనా బారినపడినపుడు ఇక్కడ ఎండాకాలం ఉందనేది గమనార్హం. సాధారణంగా వేసవిలో వైరస్‌ కొంత బలహీనంగా ఉంటుంది. ఇంకా మనం చలికాలంలోకి అడుగుపెట్టలేదు. ఉష్ణోగ్రతలు తగ్గడం మొదలయ్యాక వైరస్‌ స్వభావం ఎలా ఉంటుందనేది కీలకం కానుంది. భారీవర్షాలు, వరదల అనంతరం డెంగీ, టైఫాయిడ్‌ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు చలికాలంలో సాధారణంగానే ఇన్‌ఫ్లూయెంజా ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితులకు ఇవి కూడా తోడైతే సమస్య జఠిలమయ్యే ప్రమాదముంది. కోవిడ్‌ వ్యాధిని ఇన్‌ఫ్లూయెంజా మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. అందువల్ల ఫ్లూకు సంబంధించిన వ్యాక్సిన్‌ వేయించుకుంటే ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది.

మరింత అప్రమత్తత అవసరం
పండుగల సీజన్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో బయటకు వస్తున్నారు. కలుసుకోవడం, గుంపులుగా చేరడం పెరిగినందున ఇప్పుడు అప్రమత్తత అవసరం. ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానందున జాగ్రత్తలు ముఖ్యం. కొందరు కరోనా అధ్యాయం ముగిసిందనే భావనలో మాస్క్‌లు ధరించడం లేదు. సామాజిక దూరం, శానిటైజేషన్‌ లాంటి జాగ్రత్తలు పాటించడం మానేశారు. దీనివల్ల మళ్లీ కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగే ›ప్రమాదముంది. పండుగల సందర్భంగా పెద్దసంఖ్యలో ఒకచోట గుమికూడటం, చిన్న గుంపులుగా ఒక దగ్గర చేరడం చేయొద్దు. ఇవే కొత్త హాట్‌స్పాట్‌లుగా మారాయనే విషయాన్ని గ్రహించాలి. ఇళ్లచుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వర్షాలు తగ్గాక అక్కడక్కడా డెంగీ కేసులు రిపోర్ట్‌ అవుతున్నాయి. దీనిపట్ల మరింత అప్రమత్తత, జాగురూకత అవసరం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement