Delhi: HC Comment On Mask Must Wear When Driving Alone - Sakshi
Sakshi News home page

సొంత వాహనాల్లోనూ మాస్క్‌ తప్పనిసరి.. లేకుంటే ఛలానా? అర్థం ఉందా?

Published Wed, Feb 2 2022 9:47 AM | Last Updated on Wed, Feb 2 2022 10:15 AM

Delhi HC Absurd Comments On Mask Must Driving Alone Orders - Sakshi

కరోనా టైంలో ‘మాస్క్‌ తప్పనిసరి’ ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాయి. ముఖ్యంగా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో కఠినంగానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సొంత వాహనాల్లో ప్రయాణాలపై.. అదీ ఒంటరిగా ఉన్నప్పుడూ మాస్క్‌ తప్పనిసరి చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఢిల్లీ: ఒంటరి ప్రయాణంలో.. అదీ సొంత వాహనాల్లో మాస్క్‌ తప్పనిసరి ఆదేశాల్ని ఢిల్లీ ప్రభుత్వం ఇంకా అమలు చేస్తోంది. దీనిపై నమోదు అయిన ఓ పిటిషన్‌పై స్పందించింది ఢిల్లీ హైకోర్టు. కొ​విడ్‌-19 పేరుతో ఇంకా ఆ నిర్ణయాన్ని అమలు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ‘ఇది అసలు అర్థం పర్థం లేని నిర్ణయం. ఇంకా ఎందుకు అమలు చేస్తున్నారు?. సొంత కారులో కూర్చుని ఇంకా మాస్క్‌ తప్పనిసరిగా ధరించడం ఏంటి? అని జస్టిస్‌ విపిన్‌సింగ్‌, జస్టిస్‌ జస్మిత్‌ సింగ్‌ నేతృత్వంలోని బెంచ్‌ వ్యాఖ్యలు చేసింది. 

పరిస్థితులు ఇంకా అలానే ఉన్నాయా? ఇంకా ఈ ఆదేశం ఉండడం ఏంటి? తక్షణమే చర్యలు తీసుకోండి అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక వ్యక్తి తన తల్లితో కలిసి కారులో కూర్చుని.. అదీ కారు అద్దాలు ఎక్కించుకుని మరీ కాఫీ తాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఫొటో తీసి.. ఛలాన్‌ పంపింది ఢిల్లీ ట్రాఫిక్‌ విభాగం. దీనిపై సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే గతంలో సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి  ఓ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆదేశాలను తాము అనుసరిస్తామని.. అయినా ఆ తీర్పుపై మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వ తరపున న్యాయవాది రాహుల్‌ మెహ్రా వివరణ ఇచ్చుకున్నారు. మరి అలాంటప్పుడు.. అలాంటి ఆదేశాలను పక్కకు పెట్టే ఆలోచన ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని పేర్కొంటూ.. తక్షణమే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశించింది. 

ఇదిలా ఉంటే వ్యక్తిగత వాహనాల్లో కాకుండా.. పబ్లిక్‌ ప్లేస్‌లలో ఇతర ఏ వెహికిల్స్‌లో ప్రయాణించినా మాస్క్‌ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement