ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో మహువా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ)పై దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
ఈ కేసుకు సంబంధించి ఈడీ తనకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తోందని.. దాన్ని నిరోధించాలని మహువా ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై గరువారం విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తీర్పును రిజర్వులో పెట్టి నేడు(శుక్రవారం) విడుదల చేశారు. మహువా మొయిత్రి చేసిన ఆరోపణలను ఈడీ తరఫు న్యాయవాది ఖండించాడు. ఈ కేసు సంబంధించి మహువా సమాచారాన్ని ప్రెస్ రిలీజ్ లేదా మీడియాకు వెల్లడించటం చేయలేదని తెలిపారు.
ఇక.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసులో సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన మహువా మొయిత్రా హాజరుకాలేదు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లతో ఈడీ ప్రధాన కార్యాలయానికి ఫిబ్రవరి 19న హాజరుకావాలని ఈడీ ఇంతకుముందు ఆమెను కోరింది. అయితే... తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారు. అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని.. వచ్చే వారంలో తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మహువా మొయిత్రాపై సీబీఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరుపుతోంది.
భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్‌పాల్ ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత డిసెంబరులో మహువా లోక్‌సభ సభ్యత్వం కూడా రద్దయింది. మొయిత్రా.. తాను ఏ తప్పు చేయలేదని లోక్‌సభ సభ్యత్వ రద్దును ఖండించారు.తన బహిష్కరణ వేటుపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment