సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు అరుణ్ పిళ్లైని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. సౌత్ గ్రూపులోని ఇతర వ్యక్తులతో కలిపి పిళ్లైని విచారించాల్సి ఉందని, అందువల్ల కస్టడీ పొడిగించాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతి ఏమిటి? బుచ్చిబాబు, అరుణ్ పిళ్లైలను కలిపి విచారించడం పూర్తయిందా? కవిత విచారణకు హాజరయ్యారా? అని న్యాయమూర్తి పలు ప్రశ్నలు వేశారు. దీనికి ఈడీ న్యాయవాదులు బదులిస్తూ.. బుచ్చిబాబును శుక్రవారం విచారించనున్నామని తెలిపారు. సౌత్ గ్రూపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులతో కలిపి పిళ్లైను విచారించాల్సి ఉందని చెప్పారు.
ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అనుమానితురాలేనని, పిళ్లైతో కలిపి ఆమెను విచారించాల్సి ఉందని వివరించారు. తాను మహిళను కాబట్టి ఇంటి వద్దే విచారించేలా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన అంశాన్ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. ఆమెను ఈ నెల 11న విచారించామని.. మళ్లీ ఈ నెల 20న విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేశామని చెప్పారు. పలు అంశాలపై పిళ్లైతో కలిపి కవితను విచారించాల్సి ఉందన్నారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. పిళ్లైకు ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ ఎంపీ మాగుంటకు ఈడీ సమన్లు
ఇక ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఈ నెల 18న విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి ఈడీ అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment