సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఫోరెన్సిక్ పరీక్షల తుది నివేదికలు పేర్కొన్నాయి. టాక్సికాలజీ, గోళ్ల నమూనాలు వంటి పలు రిపోర్ట్స్‌తో పాటు ఫోరెన్సిక్ తుది నివేదికలను ముంబై పోలీసులు మంగళవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. సుశాంత్‌పై విషప్రయోగం జరగలేదని సుశాంత్ సైతం తనకు తానుగా విషం సేవించలేదని ఈ నివేదికలు స్పష్టం చేశాయి. సుశాంత్ మరణించే క్రమంలో ఎలాంటి పెనుగులాట జరగలేదని గోళ్ల నమూనా నివేదిక పేర్కొంది.
సుశాంత్‌కు ఎలాంటి గాయం కాలేదని కూడా ఈ నివేదికల్లో స్పష్టమైంది. ఇక జులై 27న ముంబై పోలీసులకు అందిన సుశాంత్ కీలక అవయవాల నివేదిక (విసెరా రిపోర్ట్) కూడా ఆయన మరణంలో ఎలాంటి అనుమానాస్పద కోణం లేదని తోసిపుచ్చింది. పోస్ట్‌మార్టం నివేదిక సైతం సుశాంత్ ఉరివేసుకోవడంతో ఊపిరాడక మరణించారని పేర్కొన్న సంగతి తెలిసిందే. సుశాంత్ మృతిపై ముంబై పోలీసులు ఫోరెన్సిక్ బృందం సభ్యులను విచారించారు. ఫోరెన్సిక్ బృందంతో మాట్లాడిన అనంతరం ఈ కేసులో ఎలాంటి సంచలన విషయాలనూ ముంబై పోలీసులు గుర్తించలేదు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ మృతి కేసుపై ప్రస్తుతం సీబీఐ విచారణ సాగుతోంది. చదవండి : అన్ని విషయాల్లో రియాదే నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment