రుతు పవనాల రాకతో గత మూడు నాలుగు రోజులుగా రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోటా జిల్లా నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్లే రహదారి తెగిపోయింది. ఇక్కడి పార్వతి నది ఉప్పొంగుతుండటంతో రోడ్డుపై నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా షియోపూర్, గ్వాలియర్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ఇక్కడికి సమీప గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మోకాళ్లలోతు నీటి మధ్య వివిధ గ్రామాల ప్రజలు కాలం వెళ్తదీస్తున్నారు. టోంక్ జిల్లాలో భారీ వర్షం కారణంగా బిసల్‌పూర్ డ్యామ్ నీటిమట్టం 310.09 ఆర్‌ఎల్ మీటర్లకు చేరుకుంది. వరద ముప్పు పొంచివున్న నేపధ్యంలో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.
జైపూర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం మేవార్ ప్రాంతంలో జూలై 8 నుండి 10 వరకు భారీ వర్షాలు కురియనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురియనున్నాయి. జులై 10 నాటికి రుతుపవనాలు మరింత బలపడతాయని, అప్పడు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment