
సాక్షి, న్యూఢిల్లీ: మయన్మార్, పాకిస్తాన్, ఇరాన్‌లలో ఓడరేవుల ద్వారా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి భారత్ కూడా దేశ ద్వీప భూభాగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉత్తర అండమాన్‌లోని ఐఎన్‌ఎస్ కోహస్సా, షిబ్‌పూర్, నికోబార్‌లోని క్యాంప్‌బెల్ స్ట్రిప్ వద్ద ఎయిర్‌స్ట్రిప్‌ను పూర్తి స్థాయి యుద్ధ స్థావరాలుగా భారత్ అభివృద్ధి చేస్తుందని సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. లక్షద్వీప్‌లోని అగట్టి వద్ద ఉన్న ఎయిర్‌స్ట్రిప్ సైనిక కార్యకలాపాల కోసం అభివృద్ధిచేస్తున్నట్లు తెలుస్తోంది. బెంగాల్ బే నుంచి మలక్కా స్ట్రెయిట్స్ వరకు, అరేబియా సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ అడెన్ వరకు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ రెండు ద్వీపాలు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాలు. ప్రపంచ వాణిజ్యంలో సగానికి పైగా ఈ మార్గం ద్వారా జరుగుతున్నాయి అని ట్రై-సర్వీస్ కమాండర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం చైనా మరింత సామర్థ్యం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. గత 70 సంవత్సరాలుగా మరుగున పడిన థాయ్ కెనాల్ ప్రాజెక్ట్‌ను పొందటానికి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అప్రమత్తమైన భారత్ ద్వీప భూభాగాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కూడా అత్యవసరమని భావిస్తోంది. బ్యాంకాక్‌కు దక్షిణాన 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలయ్ ద్వీపకల్పం ద్వారా థాయ్‌లాండ్ గల్ఫ్‌ను అండమాన్ సముద్రంతో అనుసంధానించడానికి ఈ కాలువ ప్రతిపాదించబడింది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మధ్య ప్రధాన షిప్పింగ్ ఛానల్ మలక్కా జలసంధి. అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గం. దీనికి థాయ్ కెనాల్ ప్రత్యామ్నాయంగా మారనుంది. దీని ద్వారా భారత్, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ప్రయాణించే నౌకల దూరం కనీసం 1,200 కిలోమీటర్లు వరకు తగ్గిస్తుంది. థాయ్ కెనాల్‌ను పొందటానికి చైనా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో భారత్ మరింత పటిష్టమైన చర్యలు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment