ప్రపంచానికి భారత్‌ మార్గనిర్దేశం  | India Will Give Direction To World In Amrit Kaal: PM Narendra Modi In Rajya Sabha | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి భారత్‌ మార్గనిర్దేశం 

Published Thu, Dec 8 2022 1:34 AM | Last Updated on Thu, Dec 8 2022 1:34 AM

India Will Give Direction To World In Amrit Kaal: PM Narendra Modi In Rajya Sabha - Sakshi

న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న నేటి అమృత కాలంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే విషయంలో భారత్‌ కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు బుధవారం ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సభలో మోదీ మాట్లాడారు.

రెండు చరిత్రాత్మక ఘట్టాలకు మన దేశం సాక్షిగా నిలుస్తున్న సమయంలో జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ బాధ్యతలు చేపట్టారని అన్నారు. శక్తివంతమైన జీ–20 కూటమికి భారత్‌ అధ్యక్షత వహిస్తోందని, అలాగే అమృత కాలంలోకి మన ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. ఈ అమృత కాలం దేశ అభివృద్ధి, కీర్తిప్రతిష్టలపై మనమంతా దృష్టిపెట్టాల్సిన సందర్భమని పేర్కొన్నారు.

ఈ ప్రయాణంలో దేశ ప్రజాస్వామ్యం,పార్లమెంట్, పార్లమెంట్‌ సంప్రదాయాల పాత్ర చాలా కీలకమని ఉద్ఘాటించారు.  రాజ్యసభ చైర్మన్‌ ధన్‌ఖడ్‌పై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనలో ఒక జవాన్, ఒక కిసాన్‌ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. అచ్ఛమైన రైతు బిడ్డ అయిన ఉపరాష్ట్రపతి సైనిక్‌ స్కూల్‌లో చదువుకున్నారని గుర్తుచేశారు. అందుకే ఆయనకు రైతులతోపాటు సైనికులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.  ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత ఎగువ సభపై ఉందని మోదీ చెప్పారు.  

ఈ సమావేశాలను ఫలవంతం చేద్దాం  
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను ఫలవంతంగా మార్చడానికి అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని, కలిసికట్టుగా పనిచేయాలని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో దేశాన్ని ఉన్నత స్థాయికి చేర్చడానికి కీలకమైన నిర్ణయాలను ఈ శీతాకాల సమావేశాల్లో తీసుకుంటామన్న నమ్మకం ఉందని వివరించారు.

లోక్‌సభకు తొలిసారిగా ఎంపికైనవారికి సభలో చర్చల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని అన్ని పార్టీలకు ప్రధాని సూచించారు. ప్రజాస్వామ్యంలో కొత్త తరాన్ని సిద్ధం చేయడానికి, వారి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం నూతన ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇద్దామని అన్నారు.  జగదీప్‌ ధన్‌ఖడ్‌కు మోదీ అభినందనలు తెలియజేశారు. 

కృష్ణ, ములాయం సింగ్‌కు లోక్‌సభ ఘన నివాళి  
తెలుగు సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌తోపాటు ఇటీవల మరణించిన మరో ఎనిమిది మంది మాజీ ఎంపీలకు లోక్‌సభ ఘనంగా నివాళులు అర్పించింది. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన అనంతరం స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా సంతాపం తెలిపారు. ప్రజాజీవితంలో మాజీ ఎంపీలు చేసిన సేవలను కొనియాడారు.

ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో కృష్ణ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ములాయంసింగ్‌ యాదవ్‌ ఏకంగా ఏడుసార్లు ఎంపీగా, రక్షణ శాఖ మంత్రిగా, మూడు పర్యాయాలు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఓం బిర్లా ప్రశంసించారు. మాజీ ఎంపీల మృతికి సంతాపంగా లోక్‌సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం సభను స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement