ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల త్రివేణీ సంగమంలో కుంభమేళా పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆదివారం(ఫిబ్రవరి 2) కావడంతో ఉదయం నుంచే పవిత్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాలున్నాయి.
వసంతపంచమి(Vasanta Panchami) నాడు స్నానాలు ఆచరించేందుకు రెండురోజుల ముందుగానే భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంనకు దారితీసే అన్ని మార్గాలు భక్తుల వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా రోడ్లపై జనసమూహం కనిపిస్తోంది. దీనిని గుర్తించిన అధికారులు ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
జనవరి 29 మౌని అమావాస్య రోజున దాదాపు ఎనిమిది కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మరుసటి రోజు కూడా ఇదే తీరు కనిపించింది. తరువాత శుక్ర, శనివారాల్లో రద్దీ కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే ఈరోజు (ఆదివారం) ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు వస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాళీ మార్గ్, ఆనకట్ట, సంగమం వైపు వెళ్లే రహదారులలో భద్రతను మరింత కట్టిదిట్టం చేశారు. మరోవైపు మౌని అమావాస్య స్నానోత్సవంలో జరిగిన ప్రమాదం తర్వాత, ప్రభుత్వం నిఘాను మరింతగా పెంచింది.
వసంత పంచమి రోజున సంగమ ఘాట్(Sangam Ghat) వద్ద జనం గుమిగూడకుండా చూసుకోవాలని పోలీసులకు, సైనికులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భక్తులు స్నానం చేసిన వెంటనే ఘాట్ నుంచి బయటకు వెళ్లేలా చూడాలని అధికారులు వారిని ఆదేశించారు. వసంత పంచమినాడు ఎవరూ కూడా బారికేడ్లను బద్దలు కొట్టకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బారికేడ్లు దాటవద్దని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment