
ఈ లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ వ్యవస్థాపకుడు అనుకునేరు..
లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రపతి ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన కూడా చేశారు. జూన్ 15వ తేదీన నామినేషన్ పేపర్లు దాఖలు చేసేందుకు హస్తినకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నట్లు తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అయితే..
ఈయన ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(74) కాదు. బీహార్ రాజకీయాల్లో, ఎన్నికల్లొచ్చిన ప్రతీసారి తీవ్ర గందరగోళానికి కారణమయ్యే వ్యక్తి ఇతను. పేరు కూడా లాలూ ప్రసాద్ యాదవ్. సరన్ జిల్లా మరహౌరా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని రహీంపుర్ గ్రామవాసి. ఈ లాలూ ప్రసాద్ యాదవ్‌ను అంతా ముద్దుగా ‘కర్మభూమి’ అని పిలుస్తుంటారు. గతంలోనూ ఈయన రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగే ప్రయత్నం చేశారు.
2017లో నామినేషన్ పేపర్లు దాఖలు చేశారు. ఆ టైంలో బీహార్ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్ కోవింద్, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ మధ్య ప్రధాన పోటీ నడిచింది. అయితే ఆ టైంలో లాలూ పేరుని ప్రతిపాదించేంత మంది లేకపోవడంతో అది తిరస్కరణకు గురైంది. అందుకే ఈసారి పక్కగా సిద్ధమై ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నాడట.
ఇక ఇంతకు ముందు ఎన్నో ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేశాడు. ఆ టైంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. అయితే అతనికి గెలుపు మాత్రం దక్కలేదు. ఇక 2014 లోక్‌సభ ఎన్నికలలో తన భార్య రబ్రీదేవి ఓటమికి ఈ లాలూ కూడా ఓ కారణమంటూ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఆ విషయాన్నే సంబురంగా గుర్తు చేసుకుంటున్నాడు సరన్ జిల్లా వాసి లాలూ.
ఇదిలా ఉంటే.. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ పంచాయితీ నుంచి ప్రెసిడెంట్ ఎన్నికల దాకా దేన్ని వదలకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడట. కనీసం రికార్డులతో అయినా తన పేరు పదిలపర్చుకోవాలని ఆరాట పడుతున్నాడు ఈ 42 ఏళ్ల రైతు.