భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కూటమికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఖజురహో అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎన్నికల కమిషన్‌కు అవసరమైన పత్రాలను సమర్పించకపోవడంతో 'సిగ్నేచర్ మిస్సింగ్' అభ్యర్థి పోటీ నుండి నిష్క్రమించడానికి దారితీసింది.
రాష్ట్రంలోని నివారి అసెంబ్లీ స్థానం నుంచి 2008లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఒకసారి గెలిచిన మీరా యాదవ్.. తర్వాత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ఖజురహో లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తొలుత మనోజ్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత ఈ సీటును మీరా యాదవ్‌కు ఇచ్చింది. దీంతో ఆఖరి రోజున గురువారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
అయితే శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈమె నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఆమె పత్రాలను రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించారని మీరా యాదవ్ భర్త, ఉత్తర ప్రదేశ్‌నుంచి రెండుసార్లు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అయిన దీప్ నారాయణ్ యాదవ్ చెప్పారు. తర్వాత రోజు సవరించిన ఓటరు జాబితాను సమర్పించకపోవడంతో పాటు ఒక చోట అభ్యర్థి సంతకం లేదని అధికారులు చెప్పారని ఆయన వివరించారు. దీనిపై అవసరమైతే హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు.
కాగా ఈ ఖజురహో స్థానంలో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్, ప్రస్తుత ఎంపీ వీడీ శర్మను పోటీకి దింపింది. 2019 ఎన్నికలలో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 4.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మీరా యాదవ్ నామినేషన్‌ను తిరస్కరించడం "ప్రజాస్వామ్య హత్య"గా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment