డెల్టాప్లస్‌ మూడో వేవా? కొత్త వేరియంట్‌పై ఆందోళన | Panic On Covid New Variant Delta Plus In India | Sakshi
Sakshi News home page

డెల్టాప్లస్‌ మూడో వేవా? కొత్త వేరియంట్‌పై ఆందోళన

Published Sat, Jun 19 2021 1:57 AM | Last Updated on Sat, Jun 19 2021 1:58 AM

Panic On Covid New Variant Delta Plus In India - Sakshi

  • మొదటి వేవ్‌ చివరిలో ఏర్పడిన కరోనా వేరియంట్లు మ్యుటేట్‌ అయి ఈ ఏడాది జనవరిలో డెల్టా వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. ఇది రెండో వేవ్‌కు కారణమైంది.
  • ఇప్పుడా డెల్టా రకం మరింతగా మ్యుటేషన్‌ చెంది ‘డెల్టా ప్లస్‌ (ఏవై 1)’గా మారింది. ఇప్పటికే అమెరికా, యూరప్‌ దేశాల్లో దీనితో కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలోనూ దీంతో మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
  • కోవిడ్‌ నిబంధనలను పాటించకుంటే మరో నెల రోజుల్లోనే మూడో వేవ్‌ మొదలవుతుందని, డెల్టా ప్లస్‌ విజృంభించే చాన్సుందని మహారాష్ట్ర సర్కారు ఇటీవలే హెచ్చరించింది.
  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆ రాష్ట్రంలో తొలిసారిగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసు నమోదైంది. ఓ మహిళలో ఈ వేరియంట్‌ను గుర్తించిన అధికారులు.. కాంటాక్టులకు టెస్టులు చేయిస్తున్నామన్నారు.
  • జార్ఖండ్‌లోనూ డెల్టా ప్లస్‌ కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర సర్కారు పేర్కొంది.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రెండో వేవ్‌ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భారీ స్థాయిలో కేసులకు కారణమైన కరోనా డెల్టా వేరియంట్‌ నియంత్రణలోకి వస్తోంది. కానీ ఇంతలోనే డెల్టా వేరియంట్‌ మ్యుటేషన్‌ చెంది.. కొత్తగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా మారిందని పరిశోధకులు ఇటీవల ప్రకటించారు. ఈ వేరియంట్‌ కారణంగా మూడో వేవ్‌ రావొచ్చన్న అంచనాలతో మరోసారి ఆందోళన మొదలైంది. ఇప్పటికే దేశాన్ని గడగడలాడించిన డెల్టా నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. దీనివల్ల ప్రమాదం ఎంత వరకు ఉంటుంది, ఎలా ఉంటుంది, వ్యాక్సిన్లతో ప్రయోజనం ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశంలో ఇప్పటికే చాలామంది డెల్టా వేరియంట్‌ బారినపడి కోలుకున్నందున.. డెల్టా ప్లస్‌ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని కొందరు వైద్య నిపుణులు, పరిశోధకులు చెప్తున్నారు. మరోవైపు దేశంలో కొన్ని కేసులే నమోదయ్యాయని, దాని ప్రభావమేంటో తెలిసేందుకు ఒకట్రెండు నెలలు పడుతుందని.. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండక తప్పదని మరికొందరు సూచిస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్, మూడో వేవ్‌ అంచనాలపై పల్మనాలజిస్ట్‌ వీవీ రమణప్రసాద్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కిరణ్‌ మాదల తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

డెల్టా ప్లస్‌తో మూడో వేవ్‌!
సైద్ధాంతికంగా చూస్తే మనదేశంలో కరోనా మూడో వేవ్‌ డెల్టా ప్లస్‌ వేరియెంట్‌తోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడోదశ రావొచ్చనే అంచనాలు ఎక్కువగానే ఉన్నందున.. అది డెల్టా ప్లస్‌ ఆ రూపంలోనే ఉండే అవకాశాలు ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు అవసరం. వ్యాక్సిన్లను కూడా తప్పించుకుని ‘ఇమ్యూన్‌ ఎస్కేప్‌ మెకానిజం’ కిందకు కొత్త వేరియంట్‌ మారుతుందని కొందరు సూత్రీకరణలు చేస్తున్నా.. అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. దేశంలో కరోనా రెండో వేవ్‌ ఉధృతికి కారణమైన డెల్టా వేరియెంట్‌పై ఇప్పటికే మన దగ్గరున్న వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని వివిధ పరిశోధనలు తేల్చాయి. అందువల్ల ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ అనేది కీలకంగా మారింది. వీలైనంత త్వరగా అవకాశమున్న మేర రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రస్తుత లాక్‌ డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించాలి. రెండో వేవ్‌ మాదిరిగానే మూడో వేవ్‌కు కూడా మహారాష్ట్ర నుంచే డెల్టా ప్లస్‌ వేరియెంట్‌తో మొదలయ్యే అవకాశం ఉంది. మూడో వేవ్‌ రాదనే అజాగ్రత్త వదిలేసి, డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ పట్ల మరింత జాగరూకతతో వ్యవహరించాలి. ఈ విషయంలో ప్రభుత్వాలు, ప్రజలు అంతా అప్రమత్తంగా వ్యవహరించాలి. డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా వ్యాప్తి చెందుతుందనే ఒకటి రెండు నెలల్లో స్పష్టత వస్తుంది. ఒకవేళ డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ విపరీతంగా వ్యాప్తి చెందినా.. తీవ్రత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం.
- డాక్టర్‌ వీవీ రమణప్రసాద్, కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌


ప్రమాదం పెద్దగా ఉండకపోవచ్చు
వైరస్‌ మ్యుటేషన్లలో సాధారణంగా స్పైక్‌ ప్రోటీన్‌ , రెసెప్టార్‌ బైండింగ్‌ డొమైన్‌ వంటివి మారుతుంటాయి. మనదేశంలో ఈ ఏడాది జనవరిలో బి.1.617 వేరియెంట్‌తో మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌ మొదలైంది. మార్చి నాటికి అది డెల్టా (బీ.1.617.2) వేరియంట్‌గా రూపాంతరం చెంది తీవ్రత, వ్యాప్తి వేగం పెరిగింది. ఏప్రిల్‌ కల్లా దేశంలోని 50 శాతం కేసులకు, మే నాటికి 90 శాతం కేసులకు ఆ వేరియెంటే కారణమైంది. ఇప్పుడు రెండో వేవ్‌ తగ్గుతున్న దశలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా శాంపిళ్లను పరిశీలిస్తే 20 శాతం దాకా డెల్టా వేరియంట్‌ వ్యాప్తిలో ఉంది. కొత్తగా నమోదయ్యే కేసుల్లో.. అమెరికాలో పదిశాతం, బ్రిటన్‌లో 60 శాతం దాకా ఇదే ఉంది. ప్రస్తుతం విదేశాల్లో ఈ వేరియెంట్‌ విస్తృతి దశలో ఉంది. అంటే.. మనకు ఇటీవలి మార్చిలో ఉన్నప్పటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ అలాంటి సమయంలోనే రెండు మార్పులు జరిగి డెల్టాగా మ్యుటేషన్‌ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. మనం ఉధృతి దశను దాటి వచ్చేశాం. డెల్టా వేరియెంట్‌కు ఇప్పటికే దేశంలో చాలా వరకు ప్రజలు ఎఫెక్ట్‌ అయ్యి ఉంటారని అహ్మదాబాద్‌ సెరో ప్రివెలెన్స్‌ సర్వేను బట్టి తెలుస్తోంది. దేశంలోని ప్రతీ ముగ్గురిలో ఒకరికి యాంటీబాడీస్‌ కూడా ఉత్పత్తయి ఉంటాయని అంచనా వేశారు. ప్రజలు ఇంత భారీగా ఒక మ్యుటేషన్‌తో ప్రభావితమయ్యాక.. కొద్దికాలంలోనే మరో మ్యుటేషన్‌ బారిన పడటం జరగదని అంచనా వేస్తున్నారు. అదీగాక డెల్టా నుంచే, కేవలం 10 శాతం మార్పులతో వచ్చే మ్యుటేషన్‌కు పెద్దగా ప్రభావం చూపేంత శక్తి ఉండదు. అలాగాకుండా ఇండియాదే మరో తీవ్రమైన మ్యుటేషన్‌ వస్తే ప్రమాదకరం అయ్యే అవకాశాలు ఉంటాయి.
- డాక్టర్‌ కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫెసర్, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి

నెల రోజుల్లోనే మూడో వేవ్‌!
దేశంలో కరోనా రెండో వేవ్‌ మొదలైన మహారాష్ట్రలోనే మూడో వేవ్‌ కూడా మొదలుకావొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా ఇదే హెచ్చరిక చేసింది. కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కారణంగా మూడో వేవ్‌ రావొచ్చని అంచనా వేసింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారని, భారీగా గుమిగూడటం ఇలాగే కొనసాగితే.. మరో నెల రోజుల్లోనే మూడో వేవ్‌ మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా పరిస్థితిపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే ఇటీవల ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మూడో వేవ్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చించారు. మూడో వేవ్‌ తీవ్రంగా ఉండొచ్చని, కేవలం మహారాష్ట్రలోనే యాక్టివ్‌ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరొచ్చని.. బాధితుల్లో పది శాతం వరకు పిల్లలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. కాగా మన దేశంలో వచ్చిన కరోనా రెండు వేవ్‌లలో మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితమైంది. తొలివేవ్‌లో 19 లక్షల కేసులు, రెండో వేవ్‌లో ఏకంగా 40 లక్షల కేసులు వచ్చాయి. మూడో వేవ్‌లో ఇంతకు రెండింతలుగా ఏకంగా 80 లక్షల వరకు కేసులు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

బెడ్లు, ఆక్సిజన్, మందుల స్టాకుపై దృష్టి
మూడో వేవ్‌ సన్నద్ధతలో భాగంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని.. బెడ్లు, ఆక్సిజన్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మహారాష్ట్ర సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టాలని సూచించారు. పీపీఈ కిట్లు, ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకోవాలని.. ప్రజలంతా భౌతిక దూరం, మాస్కులు వంటి కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. 

జార్ఖండ్‌లోనూ కేసులు..
జార్ఖండ్‌ రాష్ట్రంలోనూ పలు డెల్టా ప్లస్‌ కోవిడ్‌ కేసులను గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కొందరు పేషెంట్ల శాంపిల్స్‌ను భువనేశ్వర్‌లోని ల్యాబ్‌కు పంపామని, అక్కడ చేసిన వైరస్‌ జన్యు పరీక్షల్లో డెల్టా ప్లస్‌గా గుర్తించినట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌ మరింత ప్రమాదకరం కావొచ్చని, దీని వ్యాప్తి తీవ్రతపై ఇంకా నిర్ధారణ జరగాల్సి ఉందని జార్ఖండ్‌లోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) మైక్రో బయాలజీ విభాగం అధిపతి మనోజ్‌ కుమార్‌ వెల్లడించారు.  

స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులతో..
కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌ (బీ.1.167.2)లో మ్యూటేషన్లు జరిగి డెల్టా ప్లస్‌ (ఏవై.1)గా రూపాంతరం చెందింది. కరోనా వైరస్‌ మన శరీర కణాలకు అతుక్కుని, లోపలికి ప్రవేశించేందుకు తోడ్పడే స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులు జరిగాయి. ఈ మార్పును ‘కే417ఎన్‌’గా పిలుస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం చేసిన వ్యాక్సిన్లలో చాలా వరకు ఈ స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకునే పనిచేస్తాయి. ఇప్పుడీ ప్రొటీన్‌లోనే మార్పులు రావడంతో వ్యాక్సిన్లు ఎంత వరకు ప్రభావం చూపగలవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్‌ సోకడం, వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీల నుంచి కొత్త వేరియంట్‌  తప్పించుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా ప్లస్‌ వేరియంట్‌లో వచ్చిన కొత్త మార్పులు కేవలం పదిశాతమేనని, దాని ప్రభావం మరీ ఎక్కువగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వ్యాప్తి విపరీతంగా ఉన్నా.. ప్రమాదకరంగా మారే అవకాశం తక్కువనే ఆశాభావం కనిపిస్తోంది. కాగా.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ ఔషధం ప్రభావం నుంచి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తప్పించుకుంటున్నట్టుగా ఇటీవలి పరిశోధనల్లో గుర్తించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement