![Prime Minister Narendra Modi meets Rashtreey Bal Puraskar winners at his residence - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/25/ALANA.jpg.webp?itok=7HNa7AAL)
బాలపురస్కార్ గ్రహీత మీనాక్షితో మోదీ
న్యూఢిల్లీ: సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేలా సామర్థ్యాలు పెంచుకోవాలని బాలలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ విజేతలతో సమావేశమయ్యారు. పిల్లల మానసిక ఆరోగ్యం, వారికి ఎదురయ్యే సమస్యలపై చర్చించారు. జీవితంలో ముందుకు వెళ్లడానికి తొలుత చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం ప్రారంభించాలని, ఆ పెద్ద సమస్యలను సైతం సులువుగా పరిష్కరించుకొనేలా సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా పెంపొందించుకోవాలని సూచించారు.
చదరంగం ఆడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. కళలు, సంస్కృతి, పరిశోధనలు, ఆవిష్కరణలు, ఆధ్యాత్మికతను కెరీర్‌గా మార్చుకోవాలని చెప్పారు. బాల పురస్కార్ గ్రహీతల అనుభవాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. అవార్డు గ్రహీతలు పలు అంశాలపై మోదీ సలహాలు సూచనలు తీసుకున్నారు. బాల పురస్కారాలకు ఈసారి 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 11 మంది ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురు బాలలు, ఐదుగురు బాలికలు ఉన్నారు. బాల పురస్కార్ విజేతలు ఎం.గౌరవీరెడ్డి, కోలగట్ల అలనా మీనాక్షి తదితరుల ఘనతలను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ప్రశంసించారు.
‘పరీక్షా పే చర్చ’లో 38 లక్షల మంది!
ప్రధాని మోదీ ఏటా స్వయంగా పాల్గొని, విద్యార్థులతో సంభాషించే ‘పరీక్షా పే చర్చ’ కోసం ఈ ఏడాది ఏకంగా 38 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి అధికంగా 15 లక్షల మంది పాల్గొనబోతున్నారు. 155 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. 27న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరుగనుంది. కొందరు స్టేడియంలో, మిగతావారు ఆన్‌లైన్‌లో పాల్గొంటారు. పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనే విషయంలో మోదీ మార్గనిర్దేశం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment