
బనశంకరి: కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిగ్రీ చదివిన వారికి నెలకు రూ.3,000, డిప్లొమా చేసిన వారికి రూ.1,500 నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘‘యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలిస్తాం. 2.5 లక్షల ప్రభుత్వోద్యోగాల ఖాళీలను భర్తీచేస్తాం’ అని హామీ ఇచ్చారు. సోమవారం బెళగావిలో ‘యువక్రాంతి’ బహిరంగ సభ ఆయన ప్రసంగించారు. కర్ణాటకలో పాలక బీజేపీని కాంగ్రెస్ నేతలు ఐక్యమత్యంతో కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.
‘‘బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమిషన్లు మరిగింది. దేశంలో అత్యంత అవినీతిమయ సర్కార్’’ అని ఆరోపించారు. ‘‘దేశం ఒకరిద్దరి సొత్తు కాదు. అదానీలది అస్సలు కాదు. కానీ బీజేపీ స్నేహితులైన కొద్దిమందికే సర్వం దక్కుతున్నాయి. ఇది అవినీతికి దారితీస్తుంది’’ అని రాహుల్ ఆరోపించారు. గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళ ఇంటిపెద్దగా ఉన్న కుటుంబానికి నెలకు రూ.2,000 ఆర్థికసాయం, దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతీ సభ్యుడికి నెలకు 10 కేజీల ఉచిత బియ్యం ఇస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ఇప్పటికే మూడు హామీలు ప్రకటించింది. సోమవారం నాలుగో హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment