జైపూర్: ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి మనుషుల మాదిరిగానే, నోరులేని జీవాలకు ఉంటాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఉదంతాలను తెలిపే అనేక సంఘటనలు చూసే ఉంటాం. తాజాగా, మరో భావోద్వేగానికి గురిచేసే సంఘటన ఒకటి రాజస్థాన్‌లో జరిగింది. వివరాలు.. జోధ్‌పూర్ జిల్లాలోని ఫలోడి అనే గ్రామం ఉంది. దీనిలో భన్‌వ్రీ దేవి అనే 90 ఏళ్ల వృధ్దురాలు ఉంటుంది. ఆమె ఆరోగ్యం బాగాలేక మంచానికే పరిమితమైంది.. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఒక పెద్ద కొండెంగ (లగూన్) ఆమె ఇంట్లోకి ప్రవేశించింది. మెల్లగా ఆవృద్ధురాలు ఉన్న మంచంపై ఎక్కి కూర్చుంది.
కాసేపు అటూ ఇటూ చూసింది. అంతటితో ఆగకుండా ఆ ముసలావిడ పైన కూర్చొని ఆప్యాయంగా ముఖంపై నిమిరింది. మొదట ముసలావిడ కాస్త భయపడినట్లు కనిపించినా, కాసేపటకి ,కొండెంగ చూపిస్తున్న ప్రేమకు భావోద్వేగానికి లోనైంది. ఆ వృద్ధురాలి కడుపు పైన కూర్చుని మరొసారి ఆలింగనం చేసుకుంటూ.. తన ప్రేమను చూపించింది. దీంతో, కొండెంగను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని దాని వీపుపై ప్రేమతో నిమిరింది. కాసేపటికి ఆ కొండెంగ మెల్లగా మంచం దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ వావ్.. మనుషుల కన్నా నోరులేని జీవాలే మిన్న..’, ‘బామ్మ.. నిజంగా అదృష్టవంతురాలు’, ‘ఆమె ఆరోగ్యం బాగు చేయడానికే ఆ దేవుడే వచ్చాడు..’,‘పాపం.. కొండెంగ.. తన గుంపు నుంచి తప్పిపోయిందేమో..’, ‘ఆ ప్రేమను చూసి మా కళ్లలో నీళ్లు తిరిగాయి..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment