పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న హింసాకాండ ఘటన ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షాజహాన్ షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో షాజహాన్ షేక్‌ను ప్రత్యేక పోలీసు బృందం బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
టీఎంసీ నేత షాజహాన్ షేక్ 55 రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ నేపధ్యంలో షాజహాన్ షేక్ కార్యకలాపాలపై పోలీసుల బృందం నిఘా పెట్టిందని అధికారులు తెలిపారు. షాజహాన్ షేక్‌ను పోలీసులు బసిర్‌హత్ కోర్టుకు తరలించారు. జనవరి 5న సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. రేషన్ పంపిణీ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు షేక్ ఇంటిపై దాడి చేశారు. ఆ తరువాత షాజహాన్ షేక్ పరారయ్యాడు.
ఈ నేపధ్యంలో షేక్‌తోపాటు అతని మద్దతుదారులు స్థానికుల భూమిని ఆక్రమించారని, మహిళలను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే షేక్‌ను అరెస్టు చేయాలంటూ సందేశ్‌ఖాలీ ప్రాంతంలో పలువురు నిరసనలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment