ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌లో ఆయనకు ఊరట లభించలేదు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్త ధర్మాసనం.. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీకి నోటిసులు జారీ చేసింది. ఏప్రిల్ 24 వరకు సమాధానం ఇవ్వాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈడీ సమాధానంపై ఏప్రిల్ 27 వరకు రిజాయిన్డెర్ దాఖలు చేయాలని కేజ్రీవాల్‌కు తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.
ఈడీ అరెస్ట్ చట్ట విరుద్ధం అని ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరారు. ఈ కేసులో ఏం జరిగిందో తమకు తెలుసని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చట్ట బద్దంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగిందని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏప్రిల్ 10న సుప్రీంకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించిన విషయం తెలిసిందే.
లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఈడీ సమన్లను సీఎం కేజ్రీవాల్ పదేపదే నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ మార్చి 21వ తేదీన ఆయన్ని అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. 15వ తేదీ వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. నేటితో ఆయన జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. అదే సమయంలో లిక్కర్ కేసులో మరో నిందితుడు, ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ విచారణ కూడా నేడు జరగనుంది. రౌస్ అవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియా దాఖలు చేసిన రెండో పిటిషన్ ఇది.
Comments
Please login to add a commentAdd a comment