
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభు త్వం ఇష్టారాజ్యంగా అధికార దుర్వినియోగానికి పా ల్పడుతోందని, అన్ని వ్యవస్థలనూ స్వలా భం కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణమే తమ ధ్యేయమని, ఇందుకోసం భావసారూప్యం కలిగిన రాజకీయ పక్షాలతో చేతులు కలుపుతామని, కలిసి పని చేస్తామని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో వెల్లడించారు.
శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తోందని సోనియా దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దల చర్యలను పరికిస్తే ప్రజాస్వామ్యం కంటే తామే అధికులమన్న భావన వారిలో వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో విద్వేషం, హింసను ప్రేరేపిస్తున్నాయని, ప్రధానమంత్రి ఉద్దేశపూర్వకంగానే వాటిని విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. శాంతి, సామరస్యం కోసం ప్రధాని ఏనాడూ పిలుపునివ్వలేదని ఆక్షేపించారు. మతం, ఆహారం, కులం, భాష పేరిట ప్రజలపై వివక్ష చూపుతున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీది కేవలం మాటల గారడీ
రాబోయే కొన్ని నెలలు దేశ ప్రజాస్వామ్యానికి అగ్ని పరీక్షలాంటివని సోనియా అన్నారు. ‘‘ముఖ్య రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. దేశం కీలకమైన కూడలిలో ఉంది. రాజ్యాంగ ఆశయాల పరిరక్షణకు భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజావాణికి కాపలాదారుగా ఉంటాం. ప్రధాని మోదీ మాటల గారడీతో జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై లెక్కలేనన్ని కేసులు! బీజేపీలో చేరితే అవన్నీ మటుమాయం!’’ అని దుయ్యబట్టారు.