బెంగుళూరు: చంద్రయాన్-2 ప్రయోగం దాదాపుగా విజయవంతంగా జరిగిందనుకుంటున్న తరుణంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో చివరి నిముషంలో ల్యాండర్ నుండి సంకేతాలు అందడం ఆగిపోయాయి. ఈ సారి చంద్రయాన్-3లో అలా కాకుండా విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకునే విధంగా రూపొందించామని అన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.
చంద్రయాన్-2 వైఫల్యాన్ని ఇస్రో సవాలుగా స్వీకరించి చంద్రయాన్-3 ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే చంద్రయాన్-3 జులై 14, 2023న విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. నిర్ణీత సమయం ప్రకారం ఇది ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉండగా ఒకరోజు అటు ఇటుగా చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అవ్వనుంది.
ఇదిలా ఉండగా ఈ ప్రయోగం జరిగిన నాటి నుండి చంద్రయాన్-2 లా ఇందులో కూడా చివరి నిముషంలో ఏవైనా సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటనే అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్. దిశా భారత్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్-3లో విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకోగలదని, సెన్సార్లతో సహా అందులోని అన్నీ ఫెయిల్ అయినా కూడా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావడం ఖాయమని అన్నారు. ప్రపల్షన్ వ్యవస్థను ఆ విధంగా సిద్ధం చేశామని తెలిపారు.
ఆగస్టు 9,14,16 తేదీల్లో చంద్రయాన్-3 చంద్రుడిని సమీపిస్తుండగా ఒక్కో కక్ష్య మారుతూ వెళుతుందని అనంతరం ల్యాండర్ ప్రపల్షన్ ప్రక్రియ మొదలవుతుందని ఆ సమయంలోనే క్రాఫ్ట్ వేగం తగ్గించుకుని చివరిగా ఆగష్టు 23న క్షేమంగా ల్యాండ్ అవుతుందని అన్నారు. అందులోని రెండు ఇంజిన్లు పనిచేయకపోయినా కూడా సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని, ఆర్బిటర్ నుండి ల్యాండర్ వేరు కాగానే అడ్డంగా తిరిగే ప్రక్రియను క్రమపద్ధతిలో నిలువుగా కిందకు దిగేలా ల్యాండర్ డిజైన్ చేశామని, గతంలో ఇక్కడే పొరపాటు జరిగిందని ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదని ఆయన అన్నారు.
చంద్రయాన్-3 ల్యాండర్‌లో నాలుగు పేలోడ్‌లు ఉన్నాయి.. మొదటిది చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ChaSTE) చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతను కొలుస్తుంది. రాంబా-LP చంద్రుడి ఉపరితల ప్లాస్మా సాంద్రత, మార్పులను కొలుస్తుంది. భవిష్యత్తులో ల్యాండర్ల ల్యాండింగ్ స్థానాన్ని గుర్తించి నాసాకు నిర్దేశించడానికి రెట్రోరిఫ్లక్ట్రర్, చంద్రుడి కంపించే కోలాటాన్కు లెక్కించడానికి ఒక పరికరం ఉంటాయి. ఇది కాకుండా ప్రగ్యాన్ రోవర్ లో మరో మూడు పేలోడ్లు ఉంటాయని ఇస్రో చైర్మన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: త్రివిధ దళాల్లో ఖాళీలను భర్తీ చేయండి
Comments
Please login to add a commentAdd a comment