జమ్ము కశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. దీనికితోడు కొండ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఇళ్లు కూలియాయి. బారాముల్లా, కిష్త్వార్, రియాసి జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి.
కిష్త్వార్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. దీని గురించి ప్రభుత్వ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రెస్క్యూ టీమ్ అప్రమత్తమయ్యిందన్నారు. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో నేడు (మంగళవారం) కశ్మీర్‌లో పాఠశాలలను మూసివేశారు.
కశ్మీర్‌లో జరగాల్సిన ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష వాయిదా పడింది. జమ్ము-శ్రీనగర్ హైవేలోని శిథిలాలు తొలగించే వరకు ఈ రహదారిపై ప్రయాణాలు సాగించవద్దని అధికారులు ప్రయాణికులకు సూచించారు. భారీ వర్షాల నేపధ్యంలో కిష్త్వార్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రియాసిలోని దోడా, రాంబన్, గులాబ్‌గఢ్‌లలో నదులు, వాగుల్లో నలుగురు కొట్టుకుపోగా, వారిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం తదితర ఘటనల్లో12 మంది చిన్నారులతో సహా 22 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment