SSC Recruitment 2022: Apply for 4300 Sub Inspector Posts - Sakshi
Sakshi News home page

Sub-Inspector: డిగ్రీ పూర్తి చేశారా.. మీకోసమే.. 4,300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Published Thu, Aug 25 2022 7:31 PM | Last Updated on Thu, Aug 25 2022 9:13 PM

SSC Recruitment 2022: Apply for 4300 Sub Inspector Posts - Sakshi

బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారా.. పోలీస్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా.. అయితే మీకు మరో చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! సాయుధ దళాలు, ఢిల్లీ పోలీస్‌ విభాగంలో.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కొలువు మీ ముంగిట నిలిచింది! కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ .. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. తాజాగా ఢిల్లీ పోలీస్, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్‌–కేంద్ర సాయుధ పోలీస్‌ దళాలు) లో.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ తాజా నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

తెలుగు రాష్ట్రాల్లో పోలీస్‌ ఉద్యోగార్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. వీరు డిగ్రీ నుంచే తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తుంటారు. అలాంటి వారికి ఎస్‌ఎస్‌సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ మరో చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ ద్వారా ఢిల్లీ పోలీస్‌తోపాటు సీఏపీఎఫ్‌లో మొత్తం 4,300 ఎస్‌ఐ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇందులో సీఏపీఎఫ్‌లో 3960 పోస్టులు ఉండగా.. ఢిల్లీ పోలీసు విభాగంలో 340 ఖాళీలు ఉన్నాయి. 

అర్హతలు
విద్యార్హత: ఆగస్ట్‌ 30, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: జనవరి 1, 2022 నాటికి 20–25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతన శ్రేణి: రూ.35,400–రూ.1,12,400
శారీరక ప్రమాణాలు
ఎస్‌ఎస్‌సీ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హతలు, వయో పరిమితితో΄ాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. 
పురుష అభ్యర్థులు కనీసం 170 సెంటీ మీటర్లు; మహిళా అభ్యర్థులు 157 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. అదే విధంగా పురుష అభ్యర్థులకు నిర్దేశిత ఛాతీ కొలతలు తప్పనిసరి.

మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ
సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్‌ల భర్తీకి ఎస్‌ఎస్‌సీ మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ముందుగా పేపర్‌–1 పేరుతో రాత పరీక్ష, ఆ తర్వాత ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ పేరిట దేహదారుఢ్య పరీక్షలు, అనంతరం పేపర్‌–2 పేరుతో మరో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లోనూ విజయం సాధించి మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి చివరగా మెడికల్‌ టెస్ట్‌ ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా తుది నియామకాలు ఖరారు చేస్తారు.

పేపర్‌–1 ఇలా
తొలి దశగా నిర్వహించే పేపర్‌–1ను నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.

రెండో దశ ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌
పేపర్‌–1లో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు సాధించిన వారితో మెరిట్‌ జాబితా రూ΄÷ందిస్తారు. వీరికి రెండో దశలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. పలు ఫిజికల్‌ ఈవెంట్లలో అభ్యర్థులు తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అవి.. వంద మీటర్లు, 1.6 కిలో మీటర్ల పరుగు పందెం; లాంగ్‌ జంప్, హై జంప్‌; షాట్‌పుట్‌. వంద మీటర్ల పరుగును 16సెకన్లలో, 1.6కిలో మీటర్ల పరుగును 6.5 నిమిషాల్లో పూర్తి చేయాలి. 3.65 మీటర్ల దూరంతో లాంగ్‌ జంప్‌ చేయాలి. 1.2 మీటర్ల ఎత్తులో హై జంప్‌ చేయాలి. 16 ఎల్‌బీస్‌ బరువును 4.5 మీటర్ల దూరం విసరాలి. హై జంప్, లాంగ్‌ జంప్, షాట్‌ పుట్‌లకు సంబంధించి గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు.

మహిళా అభ్యర్థులకు ఈవెంట్లు ఇలా
వంద మీటర్ల పరుగును 18 సెకన్లలో; 800 మీటర్ల పరుగును నాలుగు నిమిషాల్లో; 2.7 మీటర్ల లాంగ్‌ జంప్, 0.9 మీటర్ల హై జంప్‌ ఈవెంట్లు ఉంటాయి. వీరికి కూడా లాంగ్‌ జంప్, హై జంప్‌ ఈవెంట్లలో గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. అదే విధంగా వీరికి షాట్‌ పుట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.

200 మార్కులకు పేపర్‌–2
ఫిజికల్‌ ఈవెంట్లలో విజయం సాధించిన వారికి తదుపరి దశలో పేపర్‌–2 ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ అనే ఒకే విభాగంలో 200 ప్రశ్నలు–200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. 
పేపర్‌–1, పేపర్‌–2 రెండూ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన విధించారు.
ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే రెండు పేపర్లలోనూ పొందిన మార్కులను నార్మలైజేషన్‌ విధానంలో క్రోడీకరించి.. నిర్దిష్ట కటాఫ్‌ నిబంధనల మేరకు మెరిట్‌ జాబితా రూపొందిస్తారు.

పరీక్షలో విజయానికి
పోలీస్‌ ఉద్యోగాల అభ్యర్థులు ఎక్కువగా దేహ దారుఢ్యంపైనే కసరత్తు చేస్తుంటారు. కాని రాత పరీక్షలో విజయం కూడా ఎంతో కీలకంగా నిలుస్తోంది. 

జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌
అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. భారత దేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌
ఇందులో రాణించేందుకు వెర్బల్, నాన్‌–వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్‌ విజువలైజేషన్, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అనాలిసిస్, విజువల్‌ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్‌ సిరిస్, కోడింగ్‌–డీకోడింగ్‌ నంబర్‌ అనాలజీ, ఫిగరల్‌ అనాలజీ, వర్డ్‌ బిల్డింగ్, వెన్‌ డయాగ్రమ్స్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్‌ మ్యాథ్స్‌తో΄ాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్‌ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, అల్జీబ్రా, లీనియర్‌ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.

ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ లాంగ్వేజ్‌
పేపర్‌–1లో మాత్రమే ఉండే ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో రాణించడానికి అభ్యర్థులు.. బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్‌–స్పెల్ట్‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్‌/ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్‌ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. 200 మార్కులతో ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ లాంగ్వేజ్‌ పేరుతో నిర్వహించే పేపర్‌–2లో రాణించడానికి అభ్యర్థులు.. ఫ్రేజెస్, సెంటెన్స్‌ ఫార్మేషన్, సెంటెన్స్‌ కంప్లీషన్, ప్రెసిస్‌ రైటింగ్, వొకాబ్యులరీలపై పట్టు సాధించాలి.

కమాండెంట్‌ స్థాయికి
సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా కొలువు దీరిన వారు సర్వీస్‌ నిబంధనలు, ప్రతిభ ఆధారంగా కమాండెంట్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తొలుత ఇన్‌స్పెక్టర్‌గా, ఆ తర్వాత అసిస్టెంట్‌ కమాండెంట్‌గా, అనంతరం డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్‌ హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. 

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
►దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్‌ 30,2022
►ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: సెప్టెంబర్‌ 1
►ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: నవంబర్‌లో
►తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌
►పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement