ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదం
68 మంది అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 34
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ అస్థిరతకు తాత్కాలికంగా తెరపడింది. ముఖ్యమంత్రి సుఖి్వందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కే.ఎల్.ఠాకూర్, హోషియార్ సింగ్, ఆశిష్ శర్మలు మార్చి 22న రాజీనామా చేయగా, స్పీకర్ కుల్దీప్‌సింగ్ పథానియా సోమవారం వాటిని ఆమోదించారు.
తొలుత కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ఈ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు.. ఫిబ్రవరిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ అభ్యర్థి హర్‡్ష మహజన్ గెలుపునకు దోహదపడ్డారు. మెజారిటీ ఉండి కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్విని గెలిపించుకోలేకపోయింది. అప్పటి నుంచి బీజేపీ హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పావులు కదుపుతోంది.
ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడగా.. వారు బీజేపీలో చేరి ఆ పార్టీ గుర్తుపై ఉప ఎన్నికల్లో పోటీచేశారు. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ అసెంబ్లీ బలం 68 కాగా... తొమ్మిది మంది పోను ప్రస్తుతం 59గా ఉంది. కాంగ్రెస్‌కు 34 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 25 మంది సభ్యులున్నారు.
మంగళవారం వెలువడే ఉప ఎన్నికల ఫలితాల్లో ఆరింటికి ఆరు స్థానాలు బీజేపీ నెగ్గినా వారి బలం 31 మాత్రమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో గనక ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల బలం కూడా తోడైతే బీజేపి 34కు చేరుకునే అవకాశాలుండేవి. అలా కాకుండా సరిగ్గా ఫలితాలకు ముందు రోజు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేదాకా సుఖు ప్రభుత్వం కొంతకాలం ఊపిరిపీల్చుకున్నట్లే. అదీ మళ్లీ తాజాగా ఫిరాయింపులేవీ జరగకుండా ఉంటే!
Comments
Please login to add a commentAdd a comment