రాజస్తాన్: అవినీతికి పాల్పడే వారి ఇళ్లపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేస్తే ఏం చేస్తారు.. ఆ అవినీతి డబ్బును దాచడానికి నానా తంటాలు పడతారు. ఇక్కడ ఓ తహసీల్దార్ అధికారులకు సాక్షం ఉండకూడదని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల వరకు కాల్చి బూడిద చేశాడు. ఉద్యోగం ఉంటే ఇలాంటి లక్షలు ఎన్నైనా సంపాదించుకుంటా అనుకున్నాడో ఏమో ఇలాంటి వింత పని చేసి వార్తల్లో నిలిచాడు.
ఏకంగా 20 లక్షలు స్వాహా
రాజస్థాన్ లోని సిరోహీ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల డబ్బును లంచంగా తీసుకుంటున్న సమయంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. అనంతరం పర్వత్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఇందులో తన తప్పేమీ లేదనీ, తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ కారణంగానే తాను ఈ డబ్బును తీసుకుంటున్నట్టు తెలిపాడు. దీంతో అతడిని పట్టుకుని తహసీల్దార్ కల్పేశ్ ఇంటికి ఏసీబీ అధికారులు బయలు దేరారు. జరిగినదంతా ఇంట్లోనే ఉన్న తహసీల్దార్ కు ఎవరో సమాచారం ఇచ్చారు. ఇంకేముంది బ్లాక్ మనీతో పట్టుబడితే శ్రీ కృష్ణ జన్మస్థానమే అని కంగారుపడ్డాడు. అంతకు పూర్వం పలువురు వద్ద లంచంగా తీసుకున్న డబ్బు ఇంట్లోనే ఉండడంతో ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. చివరకు కాల్చి పడేస్తే పీడా పోతుందని ఓ నిర్ణయానికి వచ్చి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ డబ్బును కాల్చడం మొదలు పెట్టాడు.
తెలివిగా ఏసీబీ అధికారులు ఇంట్లోకి రాకుండా తలుపులకు గడియ కూడా పెట్టాడండోయ్. ఇలా మొత్తం మీద ఏకంగా రూ.20 లక్షల రూపాయల నోట్ల కట్లను కాల్చేశాడు. ఈ లోపే ఏసీబీ అధికారులు అతడి ఇంటికి చేరుకొని వంటింట్లో అతడు చేస్తున్న నిర్వాకాన్ని చూశారు. తలుపుకి గడియ ఉండడంతో అధికారులు తలుపులు పగలగొట్టి తహసీల్దార్ నిర్వాకాన్ని ఆపేశారు. 20 లక్షల వరకు కాలి బూడిదైపోగా, కేవలం లక్షన్నర రూపాయలను మాత్రమే అతడి నుంచి స్వాధీనం చేసుకోగలిగారు. అయితే ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డు చేసిన ఓ అధికారి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైర్‌ల్ అయ్యింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: ఆశ చూపి.. బాలికల అమ్మకం )
Comments
Please login to add a commentAdd a comment