పండరీపురం: రెండు రోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. సర్కోలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీనిలో భాగంగా ముందుగా పండరీపూర్ రుక్మిణిదేవి ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుంచి సర్కోలి గ్రామానికి బయల్దేరారు సీఎం కేసీఆర్. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం భగీరత్ బాల్కేనివాసానికి చేరుకుని అక్కడ భోజనం చేస్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల బృందానికి భగీరత్ బాల్కే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయనున్నారు.
కాగా, సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం మహారాష్ట్రకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయన వెంట పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. కేసీఆర్ సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి ప్రత్యేక బస్సులో మహారాష్ట్రకు బయలుదేరారు. కేసీఆర్ చేతికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి వీడ్కోలు పలికారు.
600 కార్లతో కూడిన భారీ వాహన శ్రేణి ఆయన వాహనాన్ని అనుసరించింది. 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను దాటి ముఖ్యమంత్రి మహారాష్ట్రలో అడుగు పెట్టారు. మొత్తం 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. కాగా మహారాష్ట్రకు వెళ్లే మార్గమంతా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు వెలిశాయి. ప్రజలు, పార్టీ శ్రేణులు పూలు, గులాబీ కాగితాలు వెదజల్లుతూ పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట సుమారు 6 కిలోమీటర్ల పొడవున వాహన శ్రేణి బారులు తీరింది.
Comments
Please login to add a commentAdd a comment