
‘రాజస్తాన్‌లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీగా ఉండనుంది’ : ఈ మాటలన్నది ఏ ఎన్నికల విశ్లేషకుడో కాదు. స్వయానా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాందీ! ఇది కేవలం నెల రోజుల క్రితం సంగతి!. తమ పాలనలోని ఈ రాష్ట్రంపై ఈసారి ఆ పార్టీ ఏ మేరకు ఆశలు పెట్టుకుందో చెప్పేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలతో, ముఖ్యంగా మధ్యప్రదేశ్‌తో పోలిస్తే రాజస్తాన్‌లో కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశావహంగా ఏమీ లేదని ఆ పార్టీ స్థానిక నేతలే చెబుతున్నారు.
ఇందుకు కారణాలూ అనేకం. రాజస్తాన్‌లో 1990లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచీ అక్కడ దానికి, కాంగ్రెస్‌కు ద్విముఖ పోరే సాగుతూ వస్తోంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశంగానే ఉంటుంది. అలా చూసుకున్నా ఈసారి అధికారం తమదేనని బీజేపీ ధీమాగా ఉంది. గహ్లోత్ సర్కారు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతోందని, అసమర్థ పాలన సాగుతోందని సర్వత్రా అభిప్రాయం నెలకొందని చెబుతోంది. దీనికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ నేతల అంతర్గత పోరు తమ పనిని మరింత తేలిక చేస్తుందని భావిస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఉండటం, ప్రధాని మోదీ ఛరిష్మా వంటివి మరింతగా కలిసొస్తాయని కాషాయ నేతలంటున్నారు. తమ డబుల్ ఇంజన్ నినాదానికే ఈసారి రాజస్తానీలు ఓటేస్తారని బీజేపీ ఆశతో ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు యువ నేత సచిన్ పైలట్ అసమ్మతి రాగాలను ఎదుర్కొంటూనే, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతకూ అడ్డుకట్ట వేసేందుకు సీఎం అశోక్ గహ్లోత్ చెమటోడుస్తున్నారు.
పథకాలే పథకాలు...
ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు కొద్ది నెలల ముందునుంచే పలు ప్రజాకర్షక పథకాలకు గహ్లోత్ తెర తీశారు.
- ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు
- రాష్ట్రంలో కులాలవారీగా జన గణన
- రూ.25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ
- పట్టణ ఉపాధి హామీ పథకం
- సామాజిక భద్రత కింద ఒక్కొక్కరికి నెలకు రూ.1,000
- ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్
- కులగణన ప్రకటన ఓబీసీలు తదితర ప్రాబల్య వర్గాల్లో బాగా పని చేస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.
- తూర్పు రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టుతో ఆ ప్రాంతమంతటికీ తాగు, సాగునీరు అందిస్తామని చెబుతోంది.
- పథకాల్లో లబ్ధిదారులుగా చేరేందుకు ఇన్‌ఫ్లేషన్ రిలీఫ్ క్యాంపుల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా గహ్లోత్ స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు!
బీజేపీది అదే వ్యూహం...
రాష్ట్రంలో తమకనువైన పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ విశ్వసిస్తోంది. వాటినుంచి గరిష్టంగా ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తోంది.
- అయితే రాష్ట్ర బీజేపీలోనూ గ్రూపు తగాదాలకు కొదవ లేదు!
- మాజీ సీఎం వసుంధర రాజే వర్గం ఈసారి ఆమే ముఖ్యమంత్రి రేస్‌లో ముందున్నారని ఇప్పట్నుంచే ప్రచారం చేస్తున్నారు. ఇతర సీనియర్లకు ఇది నచ్చడం లేదు.
- దాంతో ఎందుకైనా మంచిదని మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాదిరిగా రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ముందస్తుగా ఎవరినీ ప్రకటించలేదు. తద్వారా ఎన్నికల వేళ సీనియర్లలో అసంతృప్తులు చెలరేగి సహాయ నిరాకరణ తదితరాలకు దారి తీయకుండా జాగ్రత్త పడుతోంది.
- ఎప్పట్లాగే మోదీ మేనియానే తారకమంత్రంగా బీజేపీ రంగంలోకి దిగింది. ఆయన ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు.
- హిందూత్వ కార్డును ప్రబలంగా బీజేపీ ప్రయోగిస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన మత కల్లోలాలను మోదీ స్వయంగా గహ్లోత్ సొంత అసెంబ్లీ స్థానమైన సర్దార్‌పురా ఎన్నికల సభలో ప్రస్తావించారు!
ఇంటిపోరు ఏం చేసేనో...!
పథకాలు, ప్రచారాల మాటెలా ఉన్నా, నానాటికీ తీవ్రమవుతున్న ఇంటి పోరుతో గహ్లోత్ సతమతమవుతున్నారు.
- అధికారంలోకి వచ్చిన నాటినుంచీ పార్టీ యువ నేత సచిన్ పైలట్ ఆయనకు కంట్లో నలుసుగా మారారు.
- 2020లో పైలట్ బహిరంగంగా గహ్లోత్‌పై తిరుగుబావుటా ఎగరేశారు.
- అధిష్టానం జోక్యంతో అప్పటికి తగ్గినా అడుగడుగునా గహ్లోత్‌ను ఆయన ముప్పుతిప్పలు పెడుతున్నారు.
- అంతటితో ఆగకుండా తీవ్రమైన అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు.
- అసమర్థ పాలన సాగుతోందంటూ విమర్శలు సంధిస్తూ బీజేపీ పని తేలిక చేస్తున్నారు.
- అటు బీజేపీని, ఇటు అమస్మతిని, తిరుగుబాటును ఎదుర్కోలేక గహ్లోత్ సతమతమవుతున్నారు!
Comments
Please login to add a commentAdd a comment