
న్యూఢిల్లీ/ సాక్షి, అమరావతి: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. బీజేపీ కూటమే మూడోసారి అధికారంలోకి వస్తుందని తాజా అధ్యయనం తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 ఎంపీ సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని, తెలంగాణలోనూ బీఆర్‌ఎస్ 9 నుంచి 11 సీట్లతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని పేర్కొంది. ‘జన్ గన్ కా మన్’ పేరిట ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘టైమ్స్ నౌ–నవభారత్’ సర్వే చేసి ఈ మేరకు నివేదికను తాజాగా విడుదల చేసింది.
అన్నీ సీట్లూ వైఎస్సార్ సీపీకే..
ఆంధ్రప్రదేశ్‌లో వినూత్నమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలతో సుపరిపాలన అందిస్తూ దూసుకెళ్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి ప్రజాదరణ మరింత పెరిగినట్టు సర్వేలో తేటతెల్లమైంది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకుగాను 22 సీట్లను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 51శాతం ఓట్లతో 24 నుంచి 25 స్థానాలు దక్కించుకుంటుందని సర్వే వెల్లడించింది.
ఇక తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని, ఆ పార్టీ 36 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని, ఒక్క సీటైనా కచ్చితంగా గెలిచే అవకాశం కనిపించడం లేదని పేర్కొంది. లోక్‌సభలో ఎన్డీయే, కాంగ్రెస్ కూటముల తర్వాత వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాలతో మూడో స్థానంలో నిలుస్తుందని వెల్లడించింది.
తెలంగాణలో బీఆర్‌ఎస్ హవా
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ 37 శాతం ఓట్లతో 9 నుంచి 11 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. 29.2 శాతం ఓట్లతో కాంగ్రెస్ 2 నుంచి 3 స్థానాలు, 25.3 శాతం ఓట్లతో బీజేపీ 3 నుంచి 5 స్థానాలు సాధించవచ్చని తెలిపింది.
మూడోసారీ బీజేపీ సర్కారే..
జాతీయ స్థాయిలో వరుసగా మూడోసారి బీజేపీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సర్వే పేర్కొంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగాను.. బీజేపీ, దాని మిత్రపక్షాలు (ఎన్డీయే) కలసి 285 నుంచి 325 సీట్లు సాధిస్తాయని వివరించింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలసి 111 నుంచి 149 సీట్లకే పరిమితం అవుతాయని పేర్కొంది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 20 నుంచి 22 లోక్‌సభ సీట్లు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 12 నుంచి 14 సీట్లు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ 4 నుంచి 7 స్థానాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 4 నుంచి 8 స్థానాలకు పరిమితం అవుతాయని స్పష్టం చేసింది. ఇతరులు 18 నుంచి 38 సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది.
2019 ఎన్నికలకంటే మిన్నగా..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడం ద్వారా రికార్డు సృష్టించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దేశం మొత్తం చూపును తన వైపు తిప్పుకొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు.
నాలుగేళ్లలో సంక్షేమ పథకాల కింద డీబీటీ పద్ధతిలో పేదల ఖాతాల్లో రూ. 2.23 లక్షల కోట్లు జమ చేశారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలను వికేంద్రీకరించి ప్రజల ఇంటి గుమ్మం వద్దనే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. దాంతో సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది.
2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాలు సాధించడమే ఇందుకు తార్కాణం. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే 2019 ఎన్నికల కంటే మిన్నగా.. అంటే 51 శాతం ఓట్లతో 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమని టైమ్స్ నౌ–నవభారత్ సర్వేలో వెల్లడైంది. ‘వైనాట్ 175’ అంటూ ముఖ్యమంత్రి చెబుతున్న విషయానికి ఈ సర్వే దగ్గరగా ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment