పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో తాము సొంతంగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పునరుద్ఘాటించడంతో ఇండియా కూటిమి ఆనందం ఆవిరయ్యింది. టీఎంసీ ప్రకటనతో కాంగ్రెస్‌కు మరోమారు చుక్కెదురయ్యింది.
దీనికిముందు ఇండియా కూటమి, టీఎంసీల మధ్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయమై సీట్ల భాగస్వామ్య చర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో తృణమూల్ వర్గాలు తమ పార్టీకి మూడవ వంతు సీట్లు కూడా దక్కలేదని మీడియాకు తెలిపాయి. తృణమూల్ నేత డెరెక్ ఓబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుందని పార్టీ చైర్‌పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల కేటాయింపుపై ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్.. ఢిల్లీ, గుజరాత్, గోవాలలో ‘ఆప్’తో సీట్ల కేటాయింపుపై రాజీ కుదుర్చుకుంది. అయితే పశ్చిమబెంగాల్‌లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభకు అత్యధిక ఎంపీలను పంపే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మూడవ స్థానంలో ఉంది. కాగా అసోంలో తృణమూల్‌కు రెండు, మేఘాలయలో ఒక సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదని, అందుకే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రెయిన్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌కు పశ్చిమ బెంగాల్‌లో ఎమ్మెల్యేలు లేరని, అయినా వారికి రెండు ఎంపీ సీట్లను ఇచ్చి, గెలిపించేందుకు సిద్ధమయ్యామని, దానికి వారు నిరాకరించారని ఆయన తెలిపారు. దీంతో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారని ఓబ్రెయిన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment