
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ స్థానానికి ఓటింగ్ తేదీ మారింది. అలాగే మూడో దశలో కాకుండా ఆరో దశలో (మే 25) ఓటింగ్ జరగనుంది. గతంలో ఇక్కడ మే 7న ఓటింగ్ నిర్వహించాలనుకున్నారు.
అనంతనాగ్-రాజౌరీ స్థానానికి ఓటింగ్ తేదీని వాయిదా వేయాలని బీజేపీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ), జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీలు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాయి. ఇటీవల కురిసిన మంచు, కొండచరియలు విరిగిపడటమే దీనికి కారణమని సమాచారం. మంచు కురియడానికి తోడు, కొండచరియలు విరిగిపడటం వలన అనంతనాగ్- రాజౌరిలను కలిపే మొఘల్ రహదారిని బ్లాక్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం కొనసాగడం లేదని, దీనికితోడు ఓట్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉందని పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ నేపధ్యంలోనే అందిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఓటింగ్ తేదీలో మార్పులు చేసింది. ఈ స్థానంలో ఇప్పటికే నామినేషన్ల దాఖలు సహా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. కాగా జమ్ముకశ్మీర్‌లోని రాంబన్, బనిహాల్‌లో భారీ వర్షాలు కురవడానికి తోడు కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. మరొకరు కాలువలో కొట్టుకుపోయారు. వర్షాల కారణంగా 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్, బనిహాల్ మధ్య అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదానికి అధికారులు మూసివేశారు.
Comments
Please login to add a commentAdd a comment