What Is Kavach System Indian Railways And How It Works - Sakshi
Sakshi News home page

‘కవచ్‌’ పరిశోధనలకే పదేళ్లు.. అలా జరిగితే ప్రమాదం తప్పేదా?

Published Sun, Jun 4 2023 8:07 AM | Last Updated on Sun, Jun 4 2023 11:54 AM

What Is Kavach System Indian Railways And How Its Work - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యంత వేగంగా వందే భారత్‌ రైళ్లను తయారు చేసి, సర్వీసులను పట్టాలెక్కిస్తున్న భారతీయ రైల్వే, ప్రయాణికుల భద్రతలో అత్యంత తీవ్ర నిర్లక్ష్యాన్ని అవలంబిస్తోంది. పరస్పరం రైళ్లు ఢీకొనకుండా కాపాడే వ్యవస్థ విషయంలో నిర్లక్ష్యంతో అమాయక ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రైళ్లపై భరోసాతో వాటిలో ప్రయాణిస్తున్నవారు ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు వదులుతున్నారు.  

పదేళ్ల జాప్యం..  
రైళ్లు పరస్పరం ఢీకొనకుండా వ్యవస్థను రూపొందించడానికి ప్రయోగాల పేరుతో ఏకంగా పదేళ్ల విలువైన కాలాన్ని రైల్వే అధికారులు హరించారు. కానీ ఇప్పటివరకు ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేలేకపోయారు. ప్రయోగాలకు వేదికైన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొంత ఏర్పాటు చేసి మిగతా చోట్ల చేతులెత్తేశారు. శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన హౌరా–చెన్నై మార్గం దేశంలోనే కీలక రైల్వే లైన్‌. ఆ మార్గంలో కూడా రైల్వే కవచ్‌ ఏర్పాటు చేయలేకపోయింది.  

ఎందుకీ దుస్థితి.. 
రైల్వే నెట్‌వర్క్‌ తక్కువగా ఉండి, ఎక్కువ సంఖ్యలో రైళ్లు తిప్పే మన దేశంలో.. ఎదురెదురుగా వచ్చి రైళ్లు ఢీకొనే పరిస్థితి తరచూ ఉండేది. సిగ్నలింగ్‌ వైఫల్యమో, మానవ తప్పిదమో.. తరచూ ఒకే ట్రాక్‌ మీద ఎదురెదురుగా రైళ్లు వచ్చేవి. ప్రమాదాలు నివారించేందుకు విదేశాల నుంచి పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాలనుకున్నా, ఖరీదు ఎక్కువ కావటంతో సొంతంగానే రూపొదించాలని రైల్వే నిర్ణయించింది. అనుబంధ పరిశోధన సంస్థ రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎస్‌ఓ)కు బాధ్యతను అప్పగించింది. అది కొంతకాలం ప్రయోగాలు చేసి 2013లో తొలుత రైల్‌ కొలీజన్‌ అవాయ్‌డెన్స్‌ సిస్టం(టీకాస్‌)ను సిద్ధం చేసింది. ప్రయోగాల కోసం వికారాబాద్‌–వాడీ–సనత్‌నగర్‌ సెక్షన్లను ఎంపిక చేశారు. 260 కి.మీటర్లలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించారు.  

కవచ్‌గా మార్చి..  
ఐదేళ్ల క్రితం దానిని ‘కవచ్‌’గా మార్చి పరిజ్ఞానాన్ని మరింత అప్‌గ్రేడ్‌ చేశారు. 2022 ఫిబ్రవరి నాటికి జోన్‌ పరిధిలో 615 కి.మీ. మేర ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయోగాలు విజయవంతమయ్యాయని, వ్యవస్థను అంబాటులోకి తెస్తామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే బోర్డు అనుమతించినా.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. గతేడాది చివరలో ప్రస్తుత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వయంగా రైలు లోకో ఇంజిన్‌లో కూర్చుని ప్రయోగాలను  పరిశీలించారు. ప్రతి సంవత్సరం 5 వేల కి.మీ. మేర దాన్ని ఏర్పాటు చేసి, దేశమంతటా విస్తరిస్తామని పేర్కొన్నారు. గత సంవత్సరమే ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–హౌరా మార్గాల్లోని 2 వేల కి.మీ.నిడివిలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  

కిలోమీటర్‌కు రూ.50 లక్షలు..  
కవచ్‌ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయాలంటే కిలోమీటరుకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు తేల్చారు. ఇది రైల్వేకు పెద్ద భారంగా మారింది. పనులు వేగంగా పూర్తి చేయాలంటే బడ్జెట్‌ నిధుల్లో సింహభాగం దానికే ఖర్చు చేయాలి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1450 కి.మీ.మేర ఏర్పాటు చేయటం మినహా ఎక్కడా ఏర్పాటు చేయలేదు.  

ఏమిటీ కవచ్‌? 
కవచ్‌ పరిజ్ఞానం రైలు ఇంజిన్లతోపాటు ట్రాక్‌ వెంట కొనసాగుతుంది. మధ్యమధ్య ఫ్రీక్వెన్సీ టవర్లు ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రత్యేక కవచ్‌ యంత్రాలను అమరుస్తారు. ట్రాక్‌పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను ఏర్పాటు చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తున్న టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్‌ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్‌ఫేజెస్‌లతో అనుసంధానిస్తారు.  

ఎలా పనిచేస్తుంది? 
- రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలనే సూత్రంపై ఇది పనిచేస్తుంది.  

- దేశంలో రైలు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న సిగ్నల్‌ జంప్‌ను ఇది అప్రమత్తం చేస్తుంది. నిర్ణీత పరిధిలోపు అదే లైన్‌లో ఇంకొక రైలు ఉందని గుర్తిస్తే ఆటోమేటిక్‌గా రైలును ఆపేస్తుంది. 

- సిగ్నల్‌ దాటేసి వెళ్లడం, వేగంగా ప్రయాణించడం వంటి సందర్భాల్లోనేకాదు దట్టంగా మంచు కమ్ముకున్న అననుకూల వాతావరణంలోనూ పలుమార్లు లైన్‌–సైడ్‌ సిగ్నల్స్‌ను ఇస్తూ పైలట్‌కు సాయపడుతుంది. 

- లెవల్‌–క్రాసింగ్‌ వద్ద తనంతట తానుగా విజిల్స్‌ వేస్తుంది. రైలు నియంత్రణ కోల్పోయిన సందర్భాల్లో ప్రమాదం ఉందంటూ సంబంధిత వ్యవస్థకు తక్షణం హెచ్చరికల ద్వారా సమాచారాన్ని చేరవేస్తుంది.  

- రైలు బ్రేకు ఫెయిలైనప్పుడు కూడా ఈ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసి రైలును నిలిపివేయగలదు. హారన్‌ కొట్టాల్సిన చోట కొట్టకున్నా.. ఈ వ్యవస్థ తనంతట తానుగా ఆ పని చేస్తుంది.  

కొసమెరుపు: దేశీయంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేక చేతులెత్తేస్తున్న రైల్వే శాఖ, ఆ పరిజ్ఞానాన్ని విదేశాలకు విక్రయించేందుకు మాత్రం సిద్ధమని ప్రకటించింది. 

ఇది కూడా చదవండి: ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్‌ రైల్వేస్టేషన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement