సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులకు ఈ జనవరి చాలా ప్రత్యేకమైనది. ఈ నెల చారిత్రాత్మకం కానుంది. ఈ నెలలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.
హిందూధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని అంటారు. అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకే ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఇందులోని విశిష్టత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రాణ ప్రతిష్ఠ తప్పనిసరిగా జరుగుతుంది. ఏదైనా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ‘ప్రాణ్’ అనే పదానికి ప్రాణశక్తి అని, ‘ప్రతిష్ఠ’ అంటే స్థాపన అని అర్థం. మొత్తంగా చూసుకుంటే ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోకి ఆహ్వానించడం అని అర్థం.
ప్రాణ ప్రతిష్టకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించరు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనదవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలతో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రతిష్ఠాపన తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువయ్యాడని చెబుతారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు. శుభ ముహూర్తాలు లేకుండా మొక్కుబడిగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం తగదని పండితులు చెబుతుంటారు.
ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు ఆ విగ్రహానికి గంగాజలం లేదా వివిధ పవిత్ర నదుల నీటితో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి, నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం ఆ విగ్రహాన్ని స్వచ్ఛమైన, శుభ్రమైన ప్రదేశంలో ఉంచి గంధంపూస్తారు. తరువాత బీజాక్షర మంత్రాలు పఠిస్తూ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠగావిస్తారు. ఈ సమయంలో పంచోపచారాలు నిర్వహిస్తూ, పూజలు చేస్తారు. చివరిగా ఆ దేవతా స్వరూపానికి హారతి ఇస్తారు. ఇదే సమయంలో భగవంతునికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు.
ఇది కూడా చదవండి: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ..
Comments
Please login to add a commentAdd a comment