జార్జ్ సోరోస్.(92). ఈ పేరు వింటే చాలూ బీజేపీ మండిపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీపై ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు కేంద్రం తరపున మంతత్రి స్మృతి ఇరానీ సైతం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.ఇంతకీ ఈయనెవరూ? ప్రధాని మోదీని ఏమన్నారంటే..
► జార్జ్ సోరోస్.. హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ఈయన సంపద విలువ 8.6 బిలియన్ డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో 32 బిలియన్ డాలర్లను దానం చేస్తున్నట్లు ప్రకటించి.. 15 బిలియన్‌డాలర్లు ఇప్పటికే ఇచ్చేశాడు కూడా. ప్రపంచంలోకెల్లా ‘అత్యంత ఉదార దాత’ అనే బిరుదును ఈయనకు కట్టబెట్టింది ఫోర్బ్స్. అయితే..
► మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్(జర్మనీ--ఫిబ్రవరి 17-19 తేదీల నడుమ జరగనుంది) దరిమిలా.. జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అదానీ గ్రూప్ సంక్షోభాన్ని లేవనెత్తిన ఆయన.. విదేశీ పెట్టుబడిదారులు, భారత పార్లమెంట్‌లో విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
► ‘మోదీ, అదానీకి దగ్గరి సంబంధాలున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కష్టాల్లో పడింది. మోదీ బలహీన పడే అవకాశముంది. ‘‘ఈ పరిణామం కచ్చితంగా భారత సమాఖ్య ప్రభుత్వంపై ఆ దేశ ప్రధాని మోదీకి ఉన్న పట్టును గణనీయంగా బలహీనపరుస్తుంది.సంస్థాగత సంస్కరణల కోసం తలుపులు తెరవాల్సి వస్తుంది. నాకు అక్కడి(భారత్) విషయాలపై పెద్దగా అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ, భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణను నేను ఆశిస్తున్నాను" అని మిస్టర్ సోరోస్ పేర్కొన్నారు.
► ఈ బిలియనీర్ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పుడు మండిపడుతోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోరోస్ వ్యాఖ్యలను ‘భారత్‌పై సహించరాని దాడి’గా అభివర్ణించారామె.విదేశీ శక్తులంతా మూకుమ్మడిగా భారత ప్రజాస్వామ్య విధానంలో జోక్యం చేసుకునే యత్నం చేస్తున్నాయని.. దేశప్రజలంతా కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపు ఇచ్చారు.అంతేకాదు సోరోస్‌ను ఆర్థిక యుద్ధ నేరగాడిగా అభివర్ణించారామె.
ఆయన కేవలం ప్రధాని మోదీపైనే కాదు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను దోచుకున్న సోరోస్‌ను ఆర్థిక నేరగాడిగా ఆ దేశం ప్రకటించింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే తన కోరికను బయటపెట్టారు. ఇలాంటి వారు ఇతర దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. తమకు నచ్చిన వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతారు. గతంలోనూ మన అంతర్గత వ్యవహారాల్లో ఇలాగే విదేశీ శక్తులు జోక్యం చేసుకోగా.. వారిని మనం ఓడించాం. ఈసారి కూడా అలాగే చేస్తాం అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.
Whether the PM-linked Adani scam sparks a democratic revival in India depends entirely on the Congress, Opposition parties & our electoral process. It has NOTHING to do with George Soros. Our Nehruvian legacy ensures people like Soros cannot determine our electoral outcomes.
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 17, 2023
► జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అదానీ వ్యవహారం భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందా? అనేది పూర్తిగా కాంగ్రెస్, ఇతర ప్రతిపకక్షాలు, మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఇందులో జార్జ్ సోరోస్ కు ఎలాంటి సంబంధం లేదు. సోరోస్ లాంటి వ్యక్తులు మన ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరు అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు.
► ప్రపంచ ధనికుల్లో ఒకరైన జార్జ్ సోరోస్.. హంగేరీలో ఓ జూయిష్ ఫ్యామిలీలో పుట్టారు. నాజీల రంగ ప్రవేశంతో.. ఆయన కుటుంబం లండన్‌కు వలస వెళ్లింది. అక్కడే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. ఆపై లండన్‌లోనే ఓ ప్రముఖ బ్యాంక్‌లో కొంతకాలం పని చేసి.. 1956లో ఆయన న్యూయార్క్‌కు వెళ్లి యూరోపియన్ సెక్యూరిటీస్ అనలిస్ట్‌గా పని చేయడం ప్రారంభించారు.
► 1973లో హెడ్గే ఫండ్(పూల్ ఇన్వెస్ట్‌మెంట్) అనే సాహసోపేతమైన అడుగుతో ఆర్థిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించారాయన. ఆపై ఎన్నో సంచలనాలకు ఆయన నెలవయ్యాడు.
► బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. ఆయన దగ్గరి సంపద 8.5 బిలియన్ డాలర్లు. అలాగే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో ఛారిటీ పనులు చేస్తున్నారాయన. ప్రజాస్వామ్య పరిరక్షణ, పాదర్శకత, వాక్ స్వేచ్ఛ నినాదాలతో ఈ ఫౌండేషన్ నిధులను ఖర్చు చేస్తోంది.
► రష్యా, చెకోస్లోవేకియా, పోలాండ్, రష్యా, యుగోస్లేవియా.. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు తర్వాత ఈ దేశాల్లోనూ ఫౌండేషన్ కార్యకలాపాలు నిర్వహించారాయన. ప్రస్తుతం 70కి పైగా దేశాల్లో జార్జ్ సోరోస్ ‘ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్’ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
► రాజకీయంగానూ ఆయన అభిప్రాయాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో గతంలో.. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్‌లకు ఆయన మద్దతు ప్రకటించారు. అలాగే.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌లకు బద్ధ వ్యతిరేకి. ఇప్పుడు అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment