పూణేకి చెందిన ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’(ఈవై) కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ (26) అన్నా సెబాస్టియన్ పెరియాలి మృతి సర్వత్రా చర్చనీయాంశమైంది. మరణం తర్వాత ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సంస్థ తరుపున ఒక్క ప్రతినిధి కూడా పాల్గొనకపోవడం, రేయింబవళ్లు పని భారం మోపడం వల్లే తన కుమార్తె మరణించిందని బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది.
ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధం
అయితే అన్నా మరణంపై నెటిజన్లు ఈవై సంస్థ ఛైర్మన్ రాజీవ్ మెమానీ స్పందించారు. తన ఉద్యోగి అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై లింక్డిన్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. అన్నా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి జీవితంలో అన్నా లేని వెలితిని ఎవరూ తీర్చలేరు. ఆమె అంత్యక్రియలకు మేము హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు.. ఇంకెప్పుడూ జరగదు’అని అన్నారు. ఈ సందర్భంగా సామరస్య పూర్వకమైన ఆఫీస్ వాతావరణాన్ని ఉద్యోగులకు అందించేందుకు తాను కట్టుబడి ఉన్నానని, లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించబోనని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి : 100 రోజుల్లో సూపర్ సిక్సూ లేదు.. సెవెనూ లేదు : వైఎస్ జగన్
సంస్థ తీరు దారుణం
ఈ ఏడాది మార్చిలో ఈవైలో చేరిన అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణించారు. పని ఒత్తిడి కారణంగా తన కుమార్తె మరణించినట్లు తల్లి అనితా అగస్టిన్ కంపెనీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తన కుమార్తె అంత్యక్రియలకు కంపెనీ నుంచి ఎవరూ హాజరు కాలేదని అగస్టిన్ పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియల తర్వాత, నేను ఆమె నిర్వాహకులను సంప్రదించాను. కానీ నాకు యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. విలువలు,మానవ హక్కుల గురించి మాట్లాడే ఒక సంస్థ ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల్లో పాల్గొనకపోవడం దారుణమని అన్నారు.
పని ఒత్తిడి ఆరోపణల్ని ఖండించిన మెమోనీ
కాగా, ఈవైలో పని ఒత్తిడి కారణంగా అన్నా మరణించిందనే తల్లి చేసిన ఆరోపణలపై రాజీవ్ మెమానీ ఖండించారు. దీంతో మెమానీపై ఈవై మాజీ ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు. మోయలేని పని భారం కారణంగా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు కామెంట్లు చేయగా.. లింక్డిన్ పోస్ట్‌లో మెమానీ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
రంగంలోకి కేంద్రం
ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యోగులపై సంస్థల కఠిన వైఖరితో పాటు పనిభారం వంటి అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఈ తరుణంలో అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణంపై కేంద్రం స్పందించింది. పని వాతావరణంలో అసురక్షిత, శ్రమ దోపిడీకి గురవుతున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment