ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ అయిన తాషిగ్యాంగ్ పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పోలింగ్ బూత్‌లో మూడోసారి ఓటింగ్ జరగనుంది.
తాషిగ్యాంగ్‌లో పోలింగ్ స్టేషన్‌ను నిర్మించిన తర్వాత 2019లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2021లో తాషిగ్యాంగ్ పోలింగ్ బూత్‌లో లోక్‌సభ ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మూడోసారి. 2024లో ఈ పోలింగ్ స్టేషన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
భారత ఎన్నికల సంఘం ఈ సంవత్సరం దీన్ని మోడల్ పోలింగ్ స్టేషన్‌గా మార్చింది. ఇక్కడ 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 52 మంది ఓటర్లలో 30 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు.
ఈ పోలింగ్ స్టేషన్ కాజా సబ్ డివిజన్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రహదారి నుండి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అయితే, ప్రస్తుతం ఇక్కడ అడుగు మందం మేర మంచు కురుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం జూన్ 1న ఇక్కడ ఓటింగ్‌ను ఏర్పాటు చేసింది.
తాషిగ్యాంగ్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ముందు గ్రామస్థులు ఓటు వేయడానికి 14,567 అడుగుల ఎత్తులో ఉన్న హిక్కిమ్ గ్రామానికి వెళ్లాల్సి ఉండేది. తాషిగ్యాంగ్ కంటే ముందు, ఇదే భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ 45 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27 మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నారు. 2021లో మండి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు 49 మంది ఓటర్లు ఉండగా వీరిలో 29 మంది పురుషులు, 20 మంది మహిళలు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ 100 శాతం ఓటింగ్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment