సాక్షి, ఢిల్లీ: రెజ్లర్ల నిరసనలో.. కేంద్రంతో రెజ్లర్ల చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను ఎలాగైనా ఆ సీటు నుంచి దించే ఉద్దేశంతో నిరసనలు కొనసాగిస్తున్న రెజ్లర్లు.. కేంద్రం నుంచి లభించిన హామీతో ఓ మెట్టు దిగారు. జూన్ 15వ తేదీ దాకా ఆందోళనలను చేపట్టబోమని, అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు బజరంగ్ పూనియా మీడియాకు వెల్లడించారు. బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో ఐదు గంటల పాటు రెజ్లర్లు భేటీ అయ్యారు. బ్రిజ్‌పై వచ్చిన ఆరోపణలపై జూన్ 15వ తేదీలోపు విచారణ పూర్తి చేయిస్తామని ఈ సందర్భంగా ఆయన రెజ్లర్లకు స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బజరంగ్ పూనియా బయటకు వచ్చాక మీడియాకు తెలిపాడు.
మంత్రి చెప్పిన తేదీ వరకు నిరసనలను ఆపేస్తామని, అప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోతే మాత్రం నిరసనలను ఉదృతం చేస్తామని పూనియా మీడియా ద్వారా తెలిపాడు. అలాగే కేంద్రంతో రెజ్లర్లు ఓ ఒప్పందానికి వచ్చారని, మైనర్ బాధితురాలు కూడా తన ఫిర్యాదును వెనక్కి తీసుకుందంటూ వస్తున్న కథనాలను పూనియా తోసిపుచ్చాడు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామే తప్ప.. వెనక్కి తగ్గబోమని ప్రకటించాడు.
మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలను స్వతంత్రగా నిర్వహించాలని, బ్రిజ్ కుటుంబ సభ్యులెవరూ అందులో పాల్గొనకుండా చూడాలని కేంద్రాన్ని రెజ్లర్లు కోరినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తమపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను వాళ్లు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహిళా రెజ్లర్ల భద్రతను ప్రధానాంశంగా పరిగణిస్తామని, అలాగే.. వాళ్లపై ఎఫ్‌ఐఆర్‌లను వెనక్కి తీసుకుంటామని మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం చర్చల సారాంశాన్ని మీడియాకు తెలిపారు. అయితే.. బ్రిజ్ అరెస్ట్‌పై మాత్రం ఇరువర్గాలు స్పందించకపోవడం గమనార్హం.
ఇక ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక మైనర్‌తో పాటు ఆరుగురు రెజ్లర్ల ఫిర్యాదులు కూడా అక్కడే నమోదుకాగా.. ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజా పరిణామాలతో జూన్ 15వ తేదీలోపు ఆ దర్యాప్తు పూర్తి చేసి.. నివేదిక సమర్పించాలని కేంద్రం, ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తెచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment