కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన
Wrestlers’ protest against Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాజధాని ఢిల్లీ వేదికగా మహిళా రెజ్లర్లు, వారికి మద్దతుగా బజ్‌రంగ్ పునియా తదితరులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు.
కాగా బ్రిజ్ భూషణ్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను ఆమె అంకుల్‌నంటూ వీడియో విడుదల చేశాడు.
ఆమె మైనర్ కాదంటూ వీడియో
అందరూ అనుకుంటున్నట్లు సదరు రెజ్లర్ మైనర్ కాదని, ఆమె వయసు దాదాపు 20 ఏళ్లకు పైనే అంటూ ఆధారాలుగా కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సదరు వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
మండిపడ్డ స్వాతి మలివాల్.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ
ఈ మేరకు.. ‘‘బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా కేసు పెట్టిన మైనర్‌కు అంకుల్‌నంటూ ఓ వ్యక్తి మీడియా ముందు ఆమె ఐడెంటీని బయటపెట్టాడు. చట్టవిరుద్ధ చర్యకు పాల్పడిన అతడిపై పోక్సో చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు నేను నోటీస్ జారీ చేస్తున్నాను.
ఎందుకంటే.. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. కాబట్టి ఆయన బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని స్వాతి మలివాల్ బుధవారం ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంలో సింగ్ ప్రమేయం కూడా ఉందేమో విచారించి.. ఆయనను అరెస్టు చేయాల్సిందిగా మహిళా కమిషన్ తరఫున డిమాండ్ చేశారు.
రెజ్లర్ల పట్ల పోలీసుల చర్యపై ఆగ్రహం
కాగా భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా తదితరులు గత కొన్ని రోజులుగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలు సహా కొంతమంది క్రీడాకారులు వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించగా.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కఠినంగా ప్రవర్తించారు. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఈ క్రమంలో తాము సాధించిన పతకాలు గంగలో నిమజ్జనం చేస్తామంటూ వాళ్లు హరిద్వార్ బయల్దేరగా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఆ ప్రయత్నం విరమించారు. ఇదిలా ఉంటే.. భారత రెజ్లర్లపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య విచారం వ్యక్తం చేసింది. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని తెలిపింది.
చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్
WTC: నెట్స్‌లో శ్రమిస్తున్న యశస్వి.. దగ్గరకొచ్చి సలహాలు ఇచ్చిన కోహ్లి! వీడియో
Comments
Please login to add a commentAdd a comment