కొద్దిరోజుల్లో 2024కు వీడ్కోలు చెప్పబోతున్నాం. ఈ నేపధ్యంలో ముగుస్తున్న ఏడాదిలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను నెమరువేసుకుంటుంటాం. ఈ కోవలోకి టూరిజం రంగం కూడా వస్తుంది. 2024లో ఏ దేశంలో టూరిస్టుల తాకిడి అధికంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సర్వేలోని వివరాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
ఫ్రాన్స్
2024లో 89.4 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులతో ఫ్రాన్స్ కళకళలాడింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ను సందర్శించడానికి టూరిస్టులు ఎంతో ఉత్సాహం చూపారు. దీంతో పారిస్ ఈ ఏడాది పర్యాటకులతో నిండిపోయింది. పలు జంటలు 2024లో హనీమూన్ కోసం పారిస్‌కు వచ్చారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను చూడాలని ప్రతీఒక్కరూ కోరుకుంటారు. ఈ ప్రాంతం ఎప్పుడూ టూరిస్టులతో రద్దీగా ఉంటుంది.
స్పెయిన్
నైరుతి ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పంలో స్పెయిన్ దేశం ఉంది. పర్యాటక పరంగా స్పెయిన్ దేశం టూరిస్టులకు ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా పేరొందింది. క్యాథలిక్ మతానికి చెందిన వారు అధికంగా ఇక్కడ నివసిస్తున్నారు. గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది 85 మిలియన్లకు పైగా పర్యాటకులు స్పెయిన్‌కు తరలివస్తుంటారు. ఫ్రాన్స్ తర్వాత అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఇష్టపడదే దేశం స్పెయిన్. 2024లో ఇప్పటివరకూ 83.7 మిలియన్ల మంది పర్యాటకులు స్పెయిన్‌ను సందర్శించారు.
అమెరికా
2024 చివరినాటికి అమెరికాకు 79.3 మిలియన్ల మంది పర్యాటకులు వస్తారనే అంచనాలున్నాయి. పర్యాటకులు సందర్శిస్తున్న ప్రదేశాల జాబితాలో అమెరికా ముందంజలో ఉంది. అమెరికాలోని న్యూయార్క్ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతం. న్యూయార్క్‌లోని ఎత్తయిన భవనాలు, లాస్ ఏంజిల్స్‌లోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.
చైనా
అన్ని రంగాలలో ముందంజలో ఉన్న చైనా టూరిజంలోనూ దూసుకుపోతోంది. ఈ రంగంలో చైనా తనదైన ముద్ర వేసింది. 2024 చివరినాటికల్లా 65.7 మిలియన్ల పర్యాటకులు చైనాను సందర్శిస్తారనే అంచనాలున్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈ దేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చైనాలోని టెర్రకోటా ఆర్మీ, లింటాంగ్ డిస్ట్రిక్ట్, జియాన్, షాంగ్సీ, బీజింగ్ పురాతన అబ్జర్వేటరీ, డాంగ్‌చెంగ్, టెంపుల్ ఆఫ్ హెవెన్, డాంగ్‌చెంగ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు నిత్యం సందర్శకులతో కళకళలాడుతుంటాయి.
ఇటలీ
యూరప్‌లోని ఇటలీ అత్యంత విలాసంతమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇటలీ 2024లో 64.5 మిలియన్ల మంది పర్యాటకులను స్వాగతించనుందనే అంచనాలున్నాయి. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్ వంటి నగరాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ దేశంలోని అమాల్ఫీ తీరాన్ని పర్యాటకులు సందర్శిస్తుంటారు.
ఇది కూడా చదవండి: ఆప్ ఎన్నికల వ్యూహం: ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి.. కౌన్సిలర్లకు పట్టం
Comments
Please login to add a commentAdd a comment