‘వసంత’ ఉత్సవానికి ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

‘వసంత’ ఉత్సవానికి ముస్తాబు

Published Fri, Jan 31 2025 1:33 AM | Last Updated on Fri, Jan 31 2025 1:33 AM

‘వసంత’ ఉత్సవానికి ముస్తాబు

‘వసంత’ ఉత్సవానికి ముస్తాబు

● బాసరలో మొదలైన ఏర్పాట్లు ● పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ● వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం

భైంసా: జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న బాసర క్షేత్రం వసంత పంచమి వేడుకలకు ముస్తాబవుతోంది. అమ్మవారి జన్మదినం అయిన వసంత పంచమి రోజు ఏటా అమ్మవారి దర్శనానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా భక్తులు తరలివస్తారు. వసంత పంచమి వేడుకలకు రావాలని స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్‌ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖతోపాటు పలువురు ప్రముఖులను స్వయంగా ఆహ్వానించారు. మరోవైపు ఏర్పాట్లపై ఇదివరకే సమీక్ష చేశారు. ఈ క్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి ఉత్సవాలకు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసిరానున్నట్లు వెల్లడించారు.

అధికారుల దృష్టి...

బాసర వసంత పంచమి ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ప్రత్యేక దృష్టిసారించారు. భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి ఇది వరకే బాసర వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ జానకీషర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్‌ కూడా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ఎస్పీ జానకీషర్మిల బాసర చేరుకుని ఆలయ పరిసరాలను పరిశీలించారు. భక్తులు వెళ్లే క్యూలైన్లు, అక్షరాభ్యాస మండపాలు, వాహనాలు నిలిపే స్థలం పరిశీలించారు.

ఏటా ఉత్సవాలు..

మాగశుద్ధ పంచమి రోజున బాసరలో వసంత పంచమి నిర్వహిస్తారు. ఈ రోజున సరస్వతీ అమ్మవారి జన్మదినం జరుపుకుంటారు. వసంత పంచమి శుభదినాన బాసర భక్తులతో పోటెత్తుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు వసంత పంచమి(శ్రీపంచమి) నిర్వహించనున్నారు. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న గోదావరి నది వద్ద నిత్య హారతి ఘాట్‌లోనూ ఏర్పాట్లు చేశారు. దక్షిణ గంగ వేదనిత్యహారతి పేరిట వేద విద్యార్థులు గోదావరి నదికి ప్రతీరోజు హారతి ఇస్తున్నారు. కొద్ది దూరంలోనే సూర్యేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న ఘాట్‌లో ఆలయ పూజారులు సైతం గోదావరికి హారతి ఇస్తున్నారు. రెండు ఘాట్‌లలోనూ భక్తులకు ఇక్కట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.

పెరిగిన ప్రైవేటు అద్దెలు..

వసంత పంచమి నేపథ్యంలో బాసరలోని ప్రైవేటు లాడ్జీల గదుల అద్దెను యజమానులు అమాంతంగా పెంచేశారు. ఒక్కో గదికి వేల రూపాయల్లోనే అద్దె చెబుతున్నారు. ఇప్పటికే గదులన్నీ బుకింగ్‌ అయ్యాయని చెప్పడంతో వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్యవైశ్య సత్రం, బ్రాహ్మణసత్రం, కమ్మ సంఘంలోని గదులు కూడా బయటవారికి ఇచ్చే పరిస్థితిలేదు. దీంతో ప్రైవేటు లాడ్జీలు చెప్పిన ధర చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

పార్కింగ్‌...

ఏటా వసంత పంచమికి వేల సంఖ్యలో వచ్చే వాహనాలను కట్టడి చేసేందుకు పార్కింగ్‌ స్థలం కేటాయించారు. గోదావరి నది వద్ద, సరస్వతి ఆలయం వద్ద రెండు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంగణంలో బారీకేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఏర్పాట్లలో ఆర్టీసీ...

వసంత పంచమి నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు భైంసా, నిజామాబాద్‌ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. బస్టాండ్‌తోపాటు రైల్వేస్టేషన్‌లోనూ ఏర్పాట్లు చేశారు. బాసర ఆలయం, స్నానఘట్టాల వద్ద వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు సత్యసాయి సేవాసమితి సభ్యులు, ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు, మిషన్‌ బాసర సభ్యులు స్వచ్ఛందంగా సేవలు అందించనున్నారు.

అక్షరాభ్యాసాల కోసం ...

సరస్వతీ అమ్మవారి జన్మదినం రోజు చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించేందు కు ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఇదే రోజు వస్తుంటారు. వసంత పంచమి సందర్భంగా నూతనంగా ఆలయం పక్కన నిర్మించిన మండపంలో అక్షరశ్రీకార పూజలు జరిపించనున్నారు. ఇందు కోసం విశాలంగా నిర్మించి న హాల్‌లో బారికేడ్లు కట్టి ఏర్పాట్లు చేస్తున్నా రు. రూ.1000 టికెట్‌పై అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మహా మండపంలో అక్షర శ్రీకార పూజలు జరిపించనున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చిన రూ.100 టికెట్‌పై ఒకేసారి 500 మంది చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement