ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణ, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులు, గ్రామస్తులతో గురువారం సమావేశం నిర్వహించారు. వై జంక్షన్ సమస్య పరిష్కారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలుసుకున్నారు. గ్రామస్తుల నుంచి సమస్య పరిష్కారానికి సూచనలను తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కడ్తాల్ గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారానికి అధికారులతో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆర్డీవో అధ్యక్షతన సంబంధిత అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాన్ని పరిశీలించిందని తెలిపారు. త్వరగా గ్రామస్తుల సమస్య పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఆర్‌అండ్‌బీ ఈఈ అశోక్‌కుమార్, జాతీయ రహదారుల అధికారి ప్రసన్న, ఆర్డీవో దుర్గాప్రసాద్, సోన్ తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో సురేశ్, కడ్తాల్ గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment