ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అవినీతి మయమైన పాలన సాగుతోందని, మంత్రులందరూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో బీజేపీ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గ మోర్చాల సంయుక్త సమ్మేళనాన్ని మంగళవారం నిర్వహించారు. బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గం కన్వీనర్ పాలెపు రాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జవదేకర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
రూ. 40 వేల కోట్ల వ్యయం కాగల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ. ఒక లక్ష 20 వేల కోట్లకు పెంచడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి దాగి ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 140 కోట్ల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబం కోసం మాత్రమే పాలన సాగిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పాలనను అగ్ర రాజ్యాలైన అమెరికా, ఇంగ్లాండ్ అధ్యక్షులే కొనియాడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా నిరుద్యోగ యువత, దళితులను, మహిళలను, రైతులను మోసం చేస్తున్నారన్నారు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో ప్రధాని మోదీ ముందుకు వెళ్తుంటే సీఎం కేసీఆర్ ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీదలకు ఉచిత రేషన్ బియ్యం, వ్యవసాయ రంగానికి రుణాలు, ముద్ర లోన్, సౌచాలయాల నిర్మాణాల గురించి వివరించారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని వివిధ మోర్చాల ప్రతినిధులకు సూచించారు.
అంతకు ముందు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో మూడు రైల్వే బ్రిడ్జిలు నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయన్నారు. 40 ఏళ్లుగా యూపీఏ ప్రభుత్వం సాధించలేని మాధవనగర్ రైల్వే బ్రిడ్జిని సైతం తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందన్నారు. ఈ సమ్మేళనంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మి నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మి నారాయణ, రాష్ట్ర నాయకులు భూపతిరెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్‌రెడ్డి, పల్లె గంగారెడ్డి, నాయకులు వినయ్‌రెడ్డి, జెస్సు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment