ఎంపీ అర్వింద్, పల్లె గంగారెడ్డి, ధన్‌పాల్ తదితరులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘పసుపు బోర్డు’.. ఈ ఒక్క అంశంతోనే ధర్మపురి అర్వింద్ గత పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితకు ఓటమి రుచి చూపించి ఎంపీగా విజయం సాధించారు. ఎంపీ అయ్యాక అర్వింద్ కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చినప్పటికీ పసుపుబోర్డు అంశం మాత్రం ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు కేంద్రబిందువైంది.
ఎంపీ అర్వింద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన ప్రతిసారి పసుపుబోర్డు హామీనే లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ శ్రేణులు దాడులకు సైతం దిగిన ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. పసుపుబోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్ మాట తప్పారంటూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నా యకులు, కార్యకర్తలు విమర్శల వర్షం కురిపిస్తూ వచ్చారు. ఈ విమర్శలను దీటుగా తిప్పికొడుతూ అర్వింద్ ఎప్పటికప్పుడు బీఆర్‌ఎస్ వైఫల్యాలపై ఎదురుదాడికి దిగుతూ వచ్చారు.
ఈ మాటల యుద్ధం నేపథ్యంలో అనేకసార్లు ఎంపీ పర్యటనల సమయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల మధ్య నువ్వా.. నేనా అనేవిధంగా ఘర్షణ వాతావరణం సైతం చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో కార్యకర్తలతో పాటు పోలీసులు గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన సమయంలో.. నేరుగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఇందూరులో పసుపుబోర్డు ఏర్పాటుకు ప్రకటన చేయడంతో ఉత్తర తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం అనేక రెట్లు పెరిగింది. ఎంపీ అర్వింద్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కృతజ్ఞత సభగా..
అధికారిక కార్యక్రమాలతో పాటు రాజకీయంగా బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొననుండడంతో పార్టీ ఇందూరు జనగర్జన పేరిట సభకు నామకరణ చేసింది. అయితే ఈ సభకు రెండురోజుల ముందే ప్రధాని పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయడంతో పసుపు రైతులు ఈ సభకు మూడు జిల్లాల నుంచి భారీగా తరలి రానున్నారు.
సభను ప్రధానమంత్రికి కృతజ్ఞత సభగా మార్చనున్నట్లు పసుపు రైతులు చెబుతున్నారు. ఈ నెల1న పాలమూ రు పర్యటనలో ప్రధాని నేరుగా పసుపు బోర్డు ప్రకటన చేయడంతో అప్పటి నుంచి నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలు, రైతులు సంబురాలు చేసుకుంటు న్నారు. మూడు జిల్లాల నుంచి రైతులు తరలివచ్చి ఎంపీ అర్వింద్‌కు పెద్ద ఎత్తున సన్మానాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి సభ నేపథ్యంలో సభా ప్రాంగణం వద్దకు ఒకరోజు ముందునుంచే మహిళలు వచ్చి వెళుతున్నారు.
'జై నరేంద్ర మోదీ' అంటూ సభా ప్రాంగణం వద్ద చాలామంది మహిళలు నృత్యాలు చేస్తున్నారు. ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నట్లు మహిళలు చెబుతుండడం విశేషం. సభాప్రాంగణం వద్ద నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి వద్దకు వచ్చిన మహిళలు పాసుల కోసం అభ్యర్థనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment