సాక్షి, నిజామాబాద్: ఆరు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందని, ఏరు దాటాక తెప్ప తగలేస్తుందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్‌రావు శనివారం బోధన్ నియోజకవర్గంలోని సాటాపూర్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం మాణిక్‌భండార్, నందిపేటల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు.
కర్ణాటక ఎన్నికల్లో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఆరుగ్యారంటీలు ప్రచారం చేశారని, తీరా గెలిచాక పథకాలను మరిచారన్నారు. అక్కడి ప్రజలు ఓటు వేసినందుకు లబోదిబో మంటున్నారన్నారు. ఈసారీ బీజేపీ డకౌట్ అవుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం, బీఆర్‌ఎస్ పార్టీ సెక్యులర్ గానే ఉంటుందన్నారు.
నీళ్ల మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలు, రైతులకు కనీసం తాగు నీరు, సాగు నీరు అందించలేదని విమర్శించా రు. మాజీ మంత్రి చేయలేని పనులను గులాబీ జండా చేసిందన్నారు. నిజామాబాద్ నగరంలో గతానికి ఇప్పటీకి ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి నిధులు తెచ్చి కార్పొరేట్ ఆస్పత్రిగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
గణేష్ గుప్తను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రత్యర్థులు చేసుకుంటున్న సర్వేలన్నీ ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయాన్ని చూపిస్తున్నాయని మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనను మూడోసారి గెలిపిస్తే మీలో ఒకడిగా ఉండి ఆదుకుంటానని ప్రజల నుద్దేశించి అన్నారు. నిజామాబాద్ అర్బన్ ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు మీతో ఎమ్మెల్యే బిగాల గణేశ్ ఉన్నాడని హరీశ్‌రావు అన్నారు. కరోనా సమయంలో గల్లిగల్లీ తిరిగి నగర ప్రజలకు ధైర్యం చెప్పి ఆదుకున్నారని అన్నారు.
ఇవి చదవండి: 'ఈవీఎం' విశేషాల గురించి.. మీకు పూర్తిగా తెలుసా..!?
Comments
Please login to add a commentAdd a comment