డొంకేశ్వర్(ఆర్మూర్): ఏర్గట్ల మండల ఏపీఎం శ్యామ్ తమను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ అదే మండలానికి చెందిన మహిళా వీవోఏలు మండల సమాఖ్య అధ్యక్షురాలితో కలిసి డీఆర్డీవో సాయాగౌడ్‌కు ఫిర్యాదు చేశారు. తరచుగా ఫోన్లు, వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని వీవోఏలు డీఆర్డీవో ముందు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన డీఆర్డీవో డీపీఎంలు సంధ్యారాణి, మారుతిలను ఏర్గట్ల మండలానికి వెళ్లి విచారణ చేయాలని ఆదేశించారు. గురువారం విచారణకు వెళ్లిన డీపీఎంలు ఏం జరిగిందో ఆరా తీశారు. గతంలో మెండోరా మండల ఏపీఎంగా పని చేసిన సమయంలో కూడా శ్యామ్‌పై ఇలాంటి ఆరోపణలు రాగా, ఆయన్ను సస్పెండ్ చేశారు. మళ్లీ ఏర్గట్ల మండల ఏపీఎంగా పోస్టింగ్ తీసుకుని ఇక్కడ కూడా అలాంటి ఆరోపణలు రావడం ఆయన పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో సాయాగౌడ్ ‘సాక్షి’తో తెలిపారు. కాగా ఏపీఎంను ఈ వ్యవహారంలో నుంచి బయట పడేసేందుకు యూనియన్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment