భారీగా తగ్గిన ఎస్సారెస్పీ నీటిమట్టం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం భారీగా తగ్గిపోయింది. గడిచిన 35 రోజుల వ్యవధిలో 31 టీఎంసీల నీరు ఖాళీ అయింది. యాసంగి సీజన్లో ఆయకట్టుకు గత నెల 25 నుంచి నీటి విడుదల చేపట్టారు. ఆయకట్టుతో పాటు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు పది టీఎంసీలు తరలించారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. ప్రస్తుత సంవత్సరం నీటి వినియోగం ఎక్కువగా జరుగుతుండటంపై ప్రాజెక్ట్ అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో నీటి వినియోగం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. కాకతీయ కాలువ ద్వారా 1500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3 వేలు, సరస్వతి కాలువ ద్వారా 700, లక్ష్మికాలువ ద్వారా 250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా 270 క్యూసెక్కులు, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 397 క్యూసెక్కులు, ముంపు గ్రామాల లిప్టుల ద్వారా 312 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1081.60(49.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment