
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
పెర్కిట్(ఆర్మూర్): అనేక సంవత్సరాలుగా గల్ఫ్ కార్మికులు ఎదురు చూస్తున్న ఎన్‌ఆర్‌ఐ పాలసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సలహా కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక వ్యవస్థాపకుడు కోటపాటి నర్సింహ నాయుడు అన్నారు. మామిడిపల్లిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన సలహా కమిటీలో గల్ఫ్ కార్మికుల కష్టాలు తెలిసిన నిపుణులను చేర్చుకుంటే బాగుండేదన్నారు. అలాగే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. న్యాయ సలహాదారుడు బాలయ్య పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా ఆస్పత్రులకు రూ.85కోట్ల నిధులు
నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.85కోట్ల నిధులు మంజూరు అయినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో శుక్రవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ హాజరయ్యారు. ఈసందర్భంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల సమస్యలు, అభివృద్ధి కోసం మంత్రిని షబ్బీర్ అలీ విన్నవించి, నిధులు మంజూరు చేసేలా కృషి చేశారు. జిల్లాలో ఆస్పత్రి మౌలిక సదుపాయాలు, సిబ్బంది ఇతర నిత్యావసర అవసరాల కోసం మొత్తం రూ.63 కోట్లు మంజూరు చేశారు. సివిల్ పనులు, పరికరాల కోసం రూ. 22 కోట్లు మంజూరు చేశారు. కొత్తగా మంజూరైన అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసేందుకు ఆరోగ్య మంత్రి త్వరలో జిల్లాను సందర్శిస్తారని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా వైద్యశాఖ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వచనాలయ అభివృద్ధికి సహకరించాలి
నిజామాబాద్ అర్బన్: నగరంలోని బాపూజీ వచనాలయం అభివృద్ధికి సహకరించాలని వచనాలయం కమిటీ ప్రతినిధులు కోరారు. బాపూజీ వచనాలయం కమిటీలో నూతనంగా సలహాదారులు, కోఆప్షన్ సభ్యుల నియామకం చేపట్టగా శుక్రవారం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్షుడు భక్తవత్సలం మాట్లాడుతూ.. బాపూజీ వచనాలయాన్ని డిజిటల్ మాధ్యమంలోకి తీసుకెళ్లే ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఇకపై పుస్తకాలతో పాటు డిజిటల్ చదువుకు కూడా ఇది అనుకూలంగా ఉంటుందన్నారు. ఇందుకోసం సభ్యులు, సలహాదారులు, కోప్షన్ సభ్యులు ఆలోచనలు, సూచనలు అందించాలని కోరారు. అనంతరం నూతన సలహాదారులు తాహెర్ బిన్ హందన్, గడుగు గంగాధర్, కేశవేణు, శేఖర్ గౌడ్, దినేష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ధర్మపురి సురేందర్, కోప్షన్ సభ్యులుగా బంటు రాజేశ్వర్, మాస్టర్ శంకర్, శ్రీహరి ఆచార్య, మెగా సుబేధర్, సాయిబాబా గౌడ్‌ను సన్మానించారు. ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్, కోశాధికారి గంగాధర్‌రావు, ఉపాధ్యక్షుడు దాస్, సంయుక్త కార్యదర్శి సాంబయ్య, దత్తాత్రి, సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం